సౌ'భాగ్య' నగరం | in the state budget preferred to hyderabad urban development | Sakshi
Sakshi News home page

సౌ'భాగ్య' నగరం

Published Thu, Nov 6 2014 2:20 AM | Last Updated on Thu, Jul 11 2019 5:33 PM

సౌ'భాగ్య' నగరం - Sakshi

సౌ'భాగ్య' నగరం

చిన్న నగరాలు, పట్టణాలకు మాత్రం  కేటాయింపులు అరకొరే

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌లో హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది. శరవేగంగా విస్తరిస్తున్న నగర అవసరాలకు తగ్గట్లు మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో ప్రాధాన్యత లభించింది. పురపాలన, పట్టణాభివృద్ధి శాఖకు బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయం కింద ప్రభుత్వం రూ.4179.07 కోట్ల నిధులను కేటాయించగా.. అధిక శాతం నిధులు హైదరాబాద్ నగరాభివృద్ధికి కృషిచేస్తున్న జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎంఆర్, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ తదితర సంస్థలకే దక్కాయి.

జంట నగరాలకు తాగునీటిని సరఫరా చేస్తున్న హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజీ బోర్డు(హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) విస్తరణతోపాటు మరమ్మతు పనుల కోసం రూ.150 కోట్లను కేటాయించింది. మురికివాడ ల్లో నీటిసరఫరా మెరుగుదల కోసం ఇదే బోర్డుకు రూ.31.16 కోట్లు కేటాయించగా.. గోదావరి నీటి సరఫరా ప్రాజెక్టుకు రూ.258.33 కోట్లు, కృష్ణా నీటి సరఫరా ప్రాజెక్టుకు రూ.100 కోట్ల నిధులను మెట్రో వాటర్ బోర్డుకు రుణ సాయంగా బడ్జెట్‌లో కేటాయించడం విశేషం. మురుగునీటి బృహత్ ప్రణాళిక అమలుకు మరో రూ.41.66 కోట్లు బోర్డు ఖాతాలో చేరాయి.

ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు అవసరాల కోసం హెచ్‌ఎండీఏకు రూ.705 కోట్లను.. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం హెచ్‌ఎంఆర్ సంస్థకు రూ.416 కోట్లను రుణ సాయంగా ప్రభుత్వం కేటాయించింది.  వార్షిక పనులకు చెల్లింపులు చేసేందుకు హెచ్‌ఎండీఏకు రుణ సాయం కింద రూ. 345.83 కోట్లను కేటాయించింది. జీహెచ్‌ఎంసీలో హరిత తెలంగాణ పేరుతో మొక్కల పెంపకానికి రూ.25 కోట్లు,  హుస్సేన్‌సాగర్ పరీవాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టుకు రూ.50 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైలు రవాణా వ్యవస్థకు రూ.20.83 కోట్ల నిధులను కేటాయించింది.

ఇతర పురపాలికలకు 677 కోట్లే
జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని 67 నగర, పుర పాలక సంఘాలు, నగర పంచాయతీల పాలనను పర్యవేక్షిస్తున్న పురపాలక శాఖ డెరైక్టరేట్‌కు బడ్జెట్‌లో రూ.677.20 కోట్లను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. అందులో.. రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి కేటాయించిన రూ.150 కోట్లతోపాటు అంతర్గత రోడ్ల నిర్వహణకు రూ.54.25 కోట్లు, మునిసిపాలిటీలకు వడ్డీ లేని రుణం కింద రూ.52.50 కోట్లు, జాతీయ పట్టణ జీవనోపాధి పథకానికి రూ.57.27 కోట్లు, రాజీవ్ ఆవాస్ యోజన్(రే) పథకానికి రూ.101 కోట్ల నిధులున్నాయి. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో చేపట్టిన ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ అభివద్ధి పథకం(ఏపీఎండీపీ) తెలంగాణ విభాగానికి బడ్జెట్‌లో రూ.200 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎంకు రూ. 1,053.62 కోట్లు    
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలకు రూ. 1,053.62 కోట్లను కేటాయించా రు. వచ్చే ఏడాది మార్చి 31తో ఈ పథకం ముగిసిపోతుండగా, ఆ లోగా మిగులు పనులు పూర్తి చేయాల్సిన క్రమంలో ప్రభుత్వం ఈ పథకానికి భారీగానే నిధులు కేటాయించినా.. నిధులను వినియోగించుకోవడం అనుమానంగా మారింది. కేటాయింపులు పరిశీలిస్తే .. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద మౌలిక వసతుల కల్పన కోసం రూ. 304.12 కోట్లు, పట్టణ పేదలకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు రూ.68.54 కోట్లు, చిన్న, మధ్యస్థ పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ. 374.73 కోట్లు కేటాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement