వాహనాల రిజిస్ట్రేషన్లలో స్తబ్దత
- ‘రెండో వాహనం’పై కొనసాగుతున్న గందరగోళం
- ఒకే తరహా పేర్లతో చిక్కులు... విచారణలో జాప్యం
సాక్షి, హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్ ఆర్టీయేకు తలనొప్పిగా మారింది. ఒకే తరహా పేర్లుండటం... రెండో వాహనానికి రెండు శాతం అదనపు పన్ను చెల్లించాల్సి రావడం... వెరసి అటు ఆర్టీఏ... ఇటు వాహనదారులను గందరగోళంలోకి నెట్టేసింది. నిబంధనల ప్రకారం రెండో వాహనం కొంటే 12 శాతం లైఫ్ టాక్స్‌కు 2 శాతం పన్ను అదనంగా కట్టాలి. ఇందుకు ఆర్టీఏ అధికారులు ఆన్‌లైన్ డేటా ఆధారంగా రిజిస్ట్రేషన్ సమయంలో వాహన దారుల వివరాలు బయటకు తీస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఒకే తరహా పేర్లతో గతంలో వాహనాలు రిజిస్టర్ అయినట్టు చూపిస్తోంది. దీంతో సదరు వాహనదారుడుకి ఉన్నది ఒకటే వాహనం అయినా... తమ వద్దనున్న డేటా ప్రకారం అతడికి రెండో వాహనం ఉన్నట్టు అధికారులు పరిగణిస్తున్నారు.
రెండు శాతం అదనపు పన్ను కట్టాలని చెబుతున్నారు. దీంతో వాహనదారులు కంగుతింటున్నారు. తమకిదే తొలి వాహనమని, తమ పేరున్న ఆ వ్యక్తెవరో తెలియదని మొత్తుకుంటే... ఆ వ్యక్తి వివరాలు తెమ్మని తిప్పి పంపుతున్నారు. లేదంటే అఫిడవిట్ ఇవ్వమని అడుగుతున్నారు. తమకు సంబంధం లేని వివరాలు తామెక్కడి నుంచి తెస్తామని కొత్త వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు డీలర్లు, వాహనదారులు 2 శాతం అదనపు పన్ను ఎగవేతకు తప్పుడు పేర్లు, అడ్రస్‌లతో రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం కూడా ఈ చిక్కులకు కారణమవుతోంది. ఈ గందరగోళం మధ్య రిజిస్ట్రేషన్లు మందగిం చి... ఆర్టీఏ ఆదాయానికి గండి పడింది.
25 శాతానికి పైగా బ్రేక్...
గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కేంద్రాల పరిధిలో రోజూ 1,000 నుంచి 1,200 కొత్త వాహనాలు నమోదవుతాయి. ఒకే తరహా పేర్లున్న వ్యక్తులపైన విచారణ కారణంగా రిజిస్ట్రేషన్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వాహనదారులు ఒకటికి నాలుగుసార్లు ఆర్టీఏ చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో రిజిస్ట్రేషన్లు 25 శాతానికి పైగా పడిపోయినట్లు సమాచారం. రెండో వాహనంపైన చెల్లించవ లసిన అదనపు పన్ను వసూలు చేయకుండా వాహనదారులకు సహకరించారనే కారణంపై ప్రభుత్వం ఇటీవల 10 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసి, మరి కొందరికి షోకాజ్ నోటీస్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీఏ సిబ్బంది రిజిస్ట్రేషన్లంటేనే జంకుతున్నారు. కంప్యూటర్, డీలర్ల వద్ద జరిగే పొరపాట్లకు తాము బలవుతున్నా మంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శాశ్వత పరిష్కారం లేదా...
మొత్తంగా ఈ రెండో వాహనం వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు 6 నెలల క్రితమే ఒక ప్రతిపాదన చేశారు. డీజిల్ వాహనాలపైన ఇప్పుడున్న 12 శాతం పన్ను ను 13 శాతానికి పెంచి, రెండో వాహనంపై అదనపు పన్ను నిబంధనను తొలగించాలని ప్రతిపాదించారు. దీనిపై సీఎం కేసీఆర్ సైతం సంతకం చేశారు. దీని అమలు ఆరు నెలలకు పైగా పెండింగ్‌లోనే ఉంది.