♦ మూడు బ్యారేజీలకు వ్యాప్కోస్ అంచనా రూ.4,743 కోట్లు
♦ తాజా ప్రభుత్వ అంచనాలతో రూ.6,481.72 కోట్లకు చేరిక
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో భాగంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించదలిచిన బ్యారేజీల అంచనా వ్యయం క్రమంగా పెరుగుతోంది. మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గాల మధ్య తలపెట్టిన మూడు బ్యారేజీల నిర్మాణానికి గతంలో వ్యాప్కోస్ వేసిన అంచనా, తాజాగా నీటిపారుదల శాఖ వేసిన అంచనాల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. వ్యాప్కోస్ అంచనా రూ.4,743 కోట్లు ఉండగా, తాజా అంచనా రూ.6,481.72 కోట్లుగా ఉంది. ప్రస్తుత అంచనా రూ.1738.72 కోట్లు అధికంగా ఉంది. ఇంకా పంప్‌హౌజ్‌ల వ్యయాలను సైతం సిద్ధం చేస్తే ఈ వ్యయం మరింత పెరిగే అవకాశముంది.
భారీగా పెరిగిన అంచనా...
మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గంలో మొత్తంగా 21.29 టీఎంసీల సామర్థ్యంతో మూడు బ్యారేజీలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద 103 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ ఎత్తులో 16.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో, మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి 14 కి.మీ. దాటాక 124 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ వద్ద గోదావరి ప్రవాహపు ప్రాంతంలో అన్నారం వద్ద 3.52 టీఎంసీలతో, 25 కి.మీ. తర్వాత 134 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో సుందిళ్ల వద్ద 1.62 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయించారు. బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లు, ఇతర నిర్మాణాల కోసం రెండు వేర్వేరు ఎస్‌ఎస్‌ఆర్‌ల ప్రకారం వ్యాప్కోస్ అంచనాలు సిద్ధం చేసింది.
ఈపీసీ పద్ధతిన కుదుర్చుకున్న సమయానికి 2007-08లో ఉన్న ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం లెక్కిస్తే మూడు బ్యారేజీలకు రూ.3,649 కోట్లు ఖర్చు కానుంది. అదే ప్రస్తుత రేట్ల ప్రకారం లెక్కిస్తే వ్యయం రూ.4,743 కోట్ల మేర ఉండనుంది. ఇక్కడ వ్యత్యాసం రూ.1,094 కోట్లుగా అధికారులు గుర్తించారు. అయితే పాత రేట్ల ప్రకారం పనులు చే యడం సాధ్యం కాదని కాంట్రాక్టుర్లు తేల్చిచెప్పడంతో కొత్త రేట్ల ప్రకారమే మళ్లీ టెండర్లు పిలిచి పనులు అప్పగించాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చేసిన సూచనలకు అనుగుణంగా చిన్నపాటి మార్పులు చేస్తూ బ్యారేజీల తాజా అంచనాలను సిద్ధం చేసింది.
మూడు బ్యారేజీలకు కలిపి 6,481.72 కోట్లు అవుతుందని లెక్కగట్టింది. వ్యాప్కోస్ అంచనాతో పోలిస్తే అంచనా ఏకంగా రూ.1,738.72 కోట్లు పెరిగింది. తాజా అంచనాలో అత్యధికంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి రూ.3,438.72 కోట్లు కానుంది. అన్నారం బ్యారేజీకి రూ.1,738.72 కోట్లు, సుందిళ్ల బ్యారేజీకి రూ.1,461 కోట్లు వ్యయ అంచనా వేశారు. ఈ బ్యారేజీల పనులను ప్రారంభించేందుకు వీలుగా అంచనాలను ఆమోదించాలని కోరుతూ నీటిపారుదల శాఖ మంగళవారం ప్రభుత్వానికి లేఖ రాసింది. రెండేళ్ల కాల వ్యవధిలో ఈ పనులను పూర్తిచేసేందుకు వీలుగా తక్షణమే ఆమోదం తెలపాలని కోరింది.
పెరిగిన ‘కాళేశ్వరం’ బ్యారేజీల వ్యయం
Published Wed, Feb 10 2016 3:50 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM
Advertisement
Advertisement