రిపబ్లిక్‌డేకు గట్టి నిఘా
- పెరేడ్ గ్రౌండ్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు
- పరిశీలించిన నగర పోలీసు కమిషనర్
- రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సిటీబ్యూరో,కంటోన్మెంట్, న్యూస్‌లైన్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముష్కరమూకలు విరుచుకుపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగర పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా తీసుకుంటు న్న చర్యలను నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌ను శుక్రవారం నాటికే పోలీసు లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
శనివారం జరిగే రిహార్సల్స్‌ను వీక్షించే ఉన్నతాధికారులు భద్రతా చర్యల్లో తీసుకోవాల్సిన మార్పు చేర్పులను సూచించనున్నారు. పెరేడ్‌గ్రౌండ్స్‌తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున బలగాలను మోహరించారు. మైదానం చుట్టూ నిత్యం పెట్రోలింగ్ నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అయితే పెరేడ్‌ను వీక్షించడానికి వచ్చేవారు తమవెంట హ్యాండ్‌బ్యాగులు, కెమెరాలు, టిఫిన్‌బాక్సులు, బ్రీఫ్ కేసులను తీసుకురావడాన్ని నిషేధించారు.
రేపు ట్రాఫిక్ ఆంక్షలు: సికింద్రాబాద్ పెరేడ్‌గ్రౌండ్స్‌లో ఆదివారం జరుగనున్న గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో ఆ పరిసరాల్లో, గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్ వద్దా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ ఉత్తర్వులు జారీచేశారు.
సర్దార్‌పటేల్‌రోడ్‌లోని సెంట్రల్ టెలిగ్రాఫ్ ఆఫీసు జంక్షన్-వైఎంసీఏ చౌరస్తా మధ్య ఆదివారం ఉదయం 7-11 గంటల మధ్య వన్-వే అమలులో ఉంటుంది. దీని ప్రకారం పెరేడ్ ప్రారంభానికి ముందు సీటీవో జంక్షన్ నుంచి వైఎంసీఏ వైపు, పూర్తయిన తర్వాత వైఎంసీఏ నుంచి సీటీవో జంక్షన్ వైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. ఇదే సమయంలో కంటోన్మెంట్ గార్డెన్స్-ఎస్‌బీహెచ్ చౌరస్తా మధ్య ఎలాంటి వాహనాల ప్రవేశానికి అనుమతి ఉండదు.
బేగంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు సీటీవో ఫ్లై ఓవర్ కింది నుంచి ప్రయాణించి ప్యారడైజ్, బా లంరాయ్ మీదుగా పెరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకోవాలి.
సెయింట్‌జాన్స్ రోటరీ వచ్చే వాహనాలు వైఎంసీఏ ఫ్లైఓవర్ కింది నుంచి వచ్చి ఉప్‌కార్ చౌరస్తా లేదా క్లాక్‌టవర్ మీదుగా గ్రౌండ్స్‌కు రావాలి.
సికింద్రాబాద్ క్లబ్ ఇన్‌గేట్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్బీహెచ్ చౌరస్తాకు అనుమతించరు. వైఎంసీఏ క్రాస్‌రోడ్స్ లేదా టివోలీ చౌరస్తా మీదుగా వెళ్లాలి.
ఆర్పీ రోడ్ నుంచి ఎస్బీహెచ్ చౌరస్తా వైపు వచ్చే ట్రాఫిక్ ప్యాట్నీ నుంచి ప్యారడైజ్ లేదా క్లాక్ టవర్ వైపు మళ్లాల్సి ఉంటుంది.