తనిఖీల పేరుతో వేధింపులు తగవు
ఉస్మానియా యూనివర్సిటీ: విద్యావ్యాప్తికి ప్రభుత్వ విద్య సంస్థలతో పాటు ప్రైవేటు విద్య సంస్థలు పోటీపడి పని చేస్తున్నాయనిచ తమపై తనిఖీల పేరుతో వేధింపులు తగవని పలువురు ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు అన్నారు. బుధవారం తెలంగాణ నవ నిర్మాణ్ విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఓయూ క్యాంపస్ ఆర్ట్స్ కళాశాల న్యూసెమినార్ హాల్‌లో ప్రైవేటు విద్యా సంస్థలు-ప్రభుత్వ తనిఖీలు’ అంశం పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు శివప్రసాద్ అధ్యక్షతన జరగిన కార్యక్రమంలో విద్యాసంస్థల ప్రతినిథులు మాట్లాడుతూ స్వయం ఉపాధితో పాటు నలుగురికి ఉద్యోగం కల్పిస్తూ సేవ భావంతో విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్న విద్యాసంస్థలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కత్తిగట్టడం బాధాకరమన్నారు.
తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా అనేక ఆందోళనల్లో పాల్గొన్నామని, పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రభుత్వం అండగా నిలవకపోగా తనిఖీల పేరుతో వేధిస్తున్నదన్నారు. కళాశాలలు సరిగా లేకుంటే విద్యార్థులు ఎవరూ చేరరని, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ విద్య సంస్థలను పట్టించుకోకుండా తమపై పడటం తగదన్నారు. విద్యా సంస్థల్లో పోలీసులతో తనిఖీలు ఆపాలని, ఫీజు రీఅంబర్స్‌మెంట్ విడుదల చేయాలని, కార్పోరేట్ విద్య సంస్థల దోపిడిని నియంత్రించాలని, బోగస్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంతో చర్చలకు సిద్దంగా ఉన్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ప్రైవేటు విద్య సంస్థల జేఏసీ కన్వీనర్ రమణరెడ్డి, కోకన్వీనర్ సిద్దేశ్వర్, జూనియర్ కళాశాలల జేఏసీ కన్వీనర్ సతీష్, ప్రవేటు కళాశాలల యజమానుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు విజయ్‌భాస్కర్‌రెడ్డి, కన్వీనర్లు లక్ష్మారెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, తిప్పారెడ్డి, రామారావు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంజియాదవ్, కల్వకుర్తి ఆంజనేయులు, అంసా అధ్యక్షులు మాందాల భాస్కర్ తదితరులు ప్రసంగించారు.