ఇది కేకు కాదను కోక
హెడ్‌లైన్ తప్పనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది నిజం. పట్టు చీరలా ధగధగలు ఒలకబోస్తోన్న ఆ శారీని చూసి అత్తింటివాళ్లు నోరెళ్లబెడితే.. ఆ చీరలో నుంచి చిన్న ముక్క తీసి అత్త నోట్లో పెట్టి ఆశ్చర్యపరిచిందట కోడలు. బహుమతులు ఇచ్చిపుచ్చుకునే ట్రెండ్స్ సిటీలో కొంగొత్త పోకడలు పోతున్న ధోరణికి కేక పుట్టించే కోక కేకు ఓ చిరు ఉదాహరణ. - చల్లపల్లి శిరీష
బర్త్‌డే, మ్యారేజ్ డే, ఫ్రెషర్స్‌డే, ఫేర్వెల్ డే, న్యూఇయర్.. సెలబ్రేషన్ ఏదైనా తన ప్రాధాన్యతను విస్తరించుకుంటూ నేనే ఫైన్ అంటోంది కేక్. నిజానికి ఇప్పుడు కేక్ రుచి చూడని వేడుకలు అత్యంత స్వల్పమనే చెప్పాలి. నూతన వేడుకలకు నేను సైతం అంటూనే ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ ఆధునికులను ఆకట్టుకుంటోంది రకరకాల ఫ్లేవర్లతో చవులూరించే కేక్. చాక్‌లెట్, స్ట్రాబెర్రీ, వెనీలా, బనానా.. ఇలా డిఫరెంట్ ఫ్లేవర్లలో విభిన్న ఆకృతులతో సందడి చేస్తోంది. అదే క్రమంలో రుచిలో, ఆకృతిలో లేటెస్ట్‌గా వచ్చింది త్రీడీ కస్టమైజ్డ్ కేక్.
ఇంటీరియర్ టు కేక్ డిజైనర్
నేను ఇంటీరియర్ డిజైనర్‌ని. కేక్ తయారీ అంటే చాలా ఇష్టం. హాబీగా కేక్‌లు తయారు చేసేదాన్ని. త్రీడీ కేక్‌లు క్రేజీగా మారాక వాటి తయారీలో చాలా బిజీ అయ్యాను. 1.75 కి .గ్రాల బరువు కలిగిన త్రీడీ చీర కేక్‌ను ఎలాంటి మౌల్డ్‌లు ఉపయోగించకుండా స్వహస్తాలతో తయారు చేశాను. కేక్‌పై డెకరేషన్ కోసం 8 గంటలు కష్టపడ్డాను. దీని తర్వాత ఎంగేజ్‌మెంట్‌ల కోసం వెడ్డింగ్ రింగ్ కేక్, జ్యువెల్లరీ సెట్ కేక్, తాంబూలాల కేక్.. అంటూ నెలకు దాదాపు 50 నుంచి 60 రకాల ఆర్డర్లు వ స్తున్నాయి. అనేక థీమ్‌లతో ఆర్డర్లు రావడం.. నా క్రియేటివిటీకి పదును పెడుతున్నాయి. - తన్వీ పల్శికర్
అత్తకు ప్రేమతో...
ఇది మాఘ మాసం. శుభకార్యాల సీజన్.ఎంగేజ్‌మెంట్, పెళ్లి, మెహందీ ఫంక్షన్లు, బ్యాచిలర్ పార్టీలకు కొదవుండదు. ప్రతీ వేడుకలోనూ ‘కేక్’దే హడావిడి. ఈ క్రమంలోనే నగరానికి చెందిన కోడలు అత్తగారి పుట్టినరోజు కోసం కేక్‌ను విచిత్రంగా డిజైన్ చేయించింది. ఆ మహారాష్ట్ర ఫ్యామిలీ కోడలు తన అత్తగారి ఇంటికెళ్లి ఆమె చేతిలో ఆప్యాయంగా పెట్టిన పట్టు చీర ఏంటో తెలుసా..? నిజానికి ఓ త్రీడీ కస్టమైజ్డ్ కేక్.
‘మా అత్తకు ఎంతో ఇష్టమైన పైథాని సిల్క్ చీర, నగలను పోలి ఉండేలా కేక్ తయారు చేయించాలనుకున్నాను. అదే ఆర్డర్ చేశాను. దాదాపు ఒక రోజంతా కష్టపడి చీరలా ఉండే త్రీడీ కేక్‌ను తయారు చేశారు బేకరీ నిర్వాహకులు. చీర కొంగు మీది డిజైన్‌తో పాటు, నేను చూపించిన జ్యూవెల్లరీ అచ్చుగుద్దినట్లు తయారు చేసి ఔరా అనిపించారు. దీన్ని మా అత్తగారికి అందిస్తే ఆమె సంతోషానికి అవధుల్లేకుండా పోయాయ’ని గుర్తు చేసుకుందా కోడలు. ఈ కేక్ సహజంగానే అత్తగారి పుట్టినరోజు వేడుకలో ప్రధాన ఆక ర్షణగా నిలిచింది. అతిథులంతా ఫేస్‌బుక్, ట్వీటర్‌లో కేక్ ఫొటోలు పోస్ట్ చేస్తుంటే కోడలు పిల్ల తెగ సంబరపడిపోయింది. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు... ఒక్క కేక్ తయారీతో ఆర్డర్లతో బిజీ అయిపోయారు దానిని తయారుచేసిన తన్వీ పల్శికర్.