వంద ఎకరాల్లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్
* అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తాం: తలసాని
* చలనచిత్ర అభివృద్ధిపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: చలనచిత్ర రంగం అభివృద్ధికి రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో చలనచిత్ర అభివృద్ధి శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చలనచిత్ర రంగంపై ఆధారపడిన వారిని ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి వంద ఎకరాల భూమిని సేకరించనున్నట్లు తెలిపారు.
అందులో శిక్షణ నిమిత్తం దేశ విదేశాల నుంచి వచ్చేవారికీ వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. తక్కు వ బడ్జెట్ చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని, నెలాఖరులోగా ఐదో షో ప్రదర్శనకు అనుమతించాలని నిర్ణయించామని చెప్పారు.
అనుమతుల కోసం సింగిల్ విండో
సినిమా షూటింగులకు అవసరమైన అనుమతులను రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ద్వారా ఇచ్చేలా సింగిల్ విండో విధానానికి రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి తలసాని చెప్పారు. దరఖాస్తు చేసిన ఏడు రోజుల్లోగా అనుమతి వస్తుందని, గడువులోగా అనుమతులు జారీ కాని పక్షంలో 8వ రోజు నుంచి చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో టికెట్ల అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. వాణిజ్య ప్రాంతాలు, బస్‌డిపోలు, ప్రభుత్వ సముదాయాల్లో 200 సీట్ల సామర్థ్యంతో మినీ థియేటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
నంది అవార్డుల పేరును మార్చడంపై ప్రభుత్వ సలహాదారు రమణాచారి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ త్వరలోనే సమావేశమై చర్చించనుందని తెలిపారు. చిత్రపురి కాలనీలో 4,300 మంది సినీ కార్మికులకు ఇళ్ల నిర్మాణం జరుగుతోందని.. ఆ కాలనీలో ఆసుపత్రి, రహదారులు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు మరో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.