వర్షాల కారణంగా నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
♦ ఈదురు గాలితో కూడిన వర్షం ఎఫెక్ట్...
♦ పలు ప్రాంతాల్లో రోజంతా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
♦ మూగబోయిన కాల్‌సెంటర్, లైన్‌మెన్, ఏఈ,డీఈల ఫోన్లు స్విచ్ ఆఫ్
సాక్షి, సిటీబ్యూరో : వర్షాల కారణంగా నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలలతో కూడిన వర్షం వల్ల గుడిమల్కాపూర్ పరిధిలోని తాళ్లగడ్డ, అశోక్‌విహార్‌కాలనీ, భగవాన్‌దాస్ కాలనీల్లో శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు విద్యుత్ సరఫరా లేదు. అదేవిధంగా కూకట్‌పల్లి పరిధిలోని బాగ్‌అమీర్ ప్రాంతంలో ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మోతీనగర్ పరిధిలోని పాండురంగారావు కాలనీలో ఉదయం నుంచి రాత్రి ఏడు గంటల వరకు కరెంట్ లేదు. సుమారు వంద ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వినియోగదారులు రోజంతా అంధకారంలో మగ్గాల్సి వచ్చింది. ముఖ్యంగా లిఫ్ట్‌లు పనిచేయక పోవడంతో అపార్ట్‌మెంట్ వాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బస్తీల్లో మంచినీటి సరఫరా నిలిచి పోయింది.
అత్యవసర సమయంలో మూగబోతున్న ఫోన్లు
విద్యుత్ ప్రమాదాలు, కోతలు, ఇతర సమస్యలపై వినియోగదాల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు డిస్కం 1912 సర్వీసు నెంబ ర్‌ను, ప్రతి సర్కిల్‌కు ప్రత్యేకంగా ఫ్యూజ్ ఆఫ్ కాల్‌ను ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో వాటికి ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తడం లేదు. ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం ఎస్‌ఇ నుంచి కిందిస్థాయి లైన్‌మెన్ వరకు ఉచిత ఫోన్ సౌకర్యం కల్పించింది. వీటిని సొంత అవసరాల కోసం ఉపయోగించుకుంటూ, అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. శనివారం సాయంత్రం వీచిన భారీ ఈదురు గాలులకు చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. ఈ సమయంలో వేలాది మంది కాల్ సెంటర్‌కు ఫోన్ చేశారు. ఇది మూగబోవడంతో స్థానిక లైన్‌మెన్లకు, ఫ్యూజ్ ఆఫ్ కాల్‌సెంటర్ సిబ్బంది కి ఫోన్ చేస్తే, ఏ ఒక్కరూ ఫోన్ ఎత్త లేదు.