- బీఏసీ ఏకంగా 550 ఎంజీ
- 12 రోజుల జైలు శిక్ష విధించిన కోర్టు
- ఈ స్థాయిలో శిక్ష పడటం ఇదే తొలిసారి
సాక్షి, సిటీబ్యూరో : పీకల దాకా మందు కొట్టి... లారీ పట్టి... నివ్వెరపరిచే రికార్డు సాధించాడో ‘నిషా’చరుడు. మహారాష్ట్రలోని ఉనార్గాకు చెందిన బాలాజి అత్యంత ప్రమాదకర మొత్తంలో మద్యం సేవించి అక్కడికి చెందిన లారీనే నడుపుతూ వచ్చి బహదూర్‌పుర ప్రాంతంలో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. భారత మోటారు వాహనాల చట్టం-1988 ప్రకారం ప్రతి 100 మిల్లీ లీటర్ల (ఎంఎల్) రక్తంలో 30 మిల్లీ గ్రాములకు (ఎంజీ) మించి ఆల్కహాల్ ఉంటే అది నేరం. దీన్నే సాంకేతిక పరిభాషలో 30/100 బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) అని అంటారు.
అయితే మహారాష్ట్ర నుంచి లారీ తీసుకుని వచ్చిన ఇతగాడి బీఏసీ ఏకంగా 550 ఎంజీ/100 ఎంఎల్ రావడంతో తనిఖీ చేసిన బహదూర్‌పుర ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నిర్ఘాంత పోయారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు కౌన్సెలింగ్ అనంతరం బుధవారం ఎర్రమంజిల్‌లోని మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి బి.చెంగల్రాయనాయుడు ఇతనికి 12 రోజుల జైలు శిక్ష విధించారు. 2011 నవంబర్ 4 నుంచి డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో దాదాపు 4 వేల మంది జైలుకు వెళ్లినప్పటికీ 12 రోజుల శిక్ష పడటం మాత్రం ఇదే తొలిసారి.
మరోపక్క ప్రమాదకర స్థాయిలో మద్యం తాగి వాహ నాలు నడుపుతూ గత వారాంతంలో ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన వాహనచోదకుల్లో బాలాజీతో సహా 31 మందికి చెంగల్రాయనాయుడు జైలు శిక్ష వేశారు. వీరిలో 22 మందికి మూడు రోజులు, ఆరుగురికి ఐదు రోజులు, ఇద్దరికి ఏడు రోజులు జైలుశిక్ష విధించారు. అలాగే నాలుగో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శివశంకర్ ప్రసాద్ 10 మందికి ఒకరోజు శిక్ష వేశారని అదనపు కమిషనర్ (ట్రాఫిక్) జితేందర్ తెలిపారు. వీరితో పాటు మిగిలిన వారికి సైతం రూ.2,600 వరకు జరిమానా విధించారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు మద్యం తాగి వాహనాలు నడుపుతూ మొత్తం 1722 మంది పట్టుబడగా... వీరిలో 315 మందికి జైలుశిక్ష పడిందని ఆయన వివరించారు.