‘టెర్రర్’ సెంటిమెంట్! | investigation revealed that the Ahmedabad Crime Branch | Sakshi
Sakshi News home page

‘టెర్రర్’ సెంటిమెంట్!

Published Sat, Jul 9 2016 12:39 AM | Last Updated on Thu, Mar 28 2019 6:18 PM

‘టెర్రర్’ సెంటిమెంట్! - Sakshi

‘టెర్రర్’ సెంటిమెంట్!

ఇల్లు, ఊరితో అనుబంధం తెంచుకోని ఆఫ్రిది
గతేడాది జనవరిలో అహ్మదాబాద్‌లో ‘పర్యటన’
నగరంలో చిక్కిన నఫీజ్ ఖాన్‌కు ‘ట్రైనర్’ ఇతడు
అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్  విచారణలో వెల్లడి

 

2008లో అహ్మదాబాద్‌లోని  డైమండ్ మార్కెట్‌లో పేలుడు 2014లో బెంగళూరు చర్చి స్ట్రీట్‌లో ఉన్న ‘కోకోనట్ గ్లోవ్’ వద్ద విధ్వంసం
అదే ఏడాది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో గుహవాటి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లో బ్లాస్ట్ 2015లో బెంగళూరులోని ఎంబీ రోడ్‌లో  ఉన్న ఇజ్రాయిల్ వీసా సెంటర్‌కు నిప్పు 2016లో తనను పట్టుకోవడానికి {పయత్నించిన పోలీసు అధికారిపై కత్తితో దాడి

 

 సిటీబ్యూరో: మూడు ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలున్న ఆలమ్ జెబ్ ఆఫ్రిది ‘టై హిస్టరీ’లో మచ్చుకు కొన్నివి. ‘జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్’ సంస్థ ముసుగులో దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్ని, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు జనవరిలో హైదరాబాద్‌లో చిక్కిన నలుగురిలో కీలకమైన నఫీజ్ ఖాన్‌కు ‘బాంబుల ట్రైనర్’గానూ వ్యవహరించాడు. ఇంత కరుడుగట్టిన ఉగ్రవాదిలోనూ సెంటిమెంట్ కోణం ఉంది. పుట్టిన ఊరు, చదువుకున్న స్కూలు, కన్నతల్లి, ఆత్మహత్య చేసుకున్న చెల్లి అంటే అతడికి ప్రాణం. దేశవ్యాప్తంగా అనేక ఏజెన్సీలకు వాంటెడ్‌గా ఉండి, ఎనిమిదేళ్లుగా పరారీలో ఉన్న ఈ ఉగ్రవాది గతేడాది జనవరిలో స్వస్థలానికి వెళ్లి వచ్చాడు. డైమండ్ మార్కెట్ కేసుకు సంబంధించి పీటీ వారెంట్‌పై అహ్మదాబాద్ తరలించిన క్రైమ్ బ్రాంచ్ గత నెల 21 నుంచి మంగళవారం వరకు కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఈ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర అంశాలపై ‘సాక్షి’ కథనం..

 
సంస్కృత భాషలోనూ దిట్ట..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న జోహాపుర న్యూ ఆషియానా పార్కుకు చెందిన ఆలమ్ జెబ్ అఫ్రిది పదో తరగతి వరకు స్థానిక సన్‌ఫ్లవర్ స్కూల్లో చదివాడు. అక్కడ అరబిక్, ఉర్దూతో పాటు సంస్కృతం కూడా నేర్చుకున్నాడు. సంస్కృత భాషపై మంచి పట్టుంది. 1993లో తండ్రి మసూకర్ అహ్మద్ ఓ హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లడం అఫ్రిది జీవితంలో వచ్చిన మొదటి కుదుపు. 11-12 తరగతులు వెజల్పూర్‌లోని ద రేన్ స్కూల్‌లో చదివినప్పటికీ 2004లో ట్వెల్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాడు. నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) పబ్లిష్ చేసే మ్యాగజైన్ ‘తెహరీఖ్-ఏ-మిల్లత్’ చదవటంతో పాటు కొందరి రెచ్చగొట్టే ప్రసంగాలకు ఆకర్షితుడైన ఆలమ్ జెబ్.. తొలుత ఆ సంస్థలో సభ్యుడిగా మారాడు.

 
ఉగ్రశిక్షణలోనూ ‘ఉత్తముడు’..

సిమికి చెందిన ఆరిఫ్ కాగ్జీ, జావేద్ షేక్, షంషుద్దీన్‌తో సంబంధాలు ఏర్పడిన తర్వాత పూర్తిగా ‘ఉగ్రబాట’ పట్టాడు. వీరి ద్వారా సిమి చీఫ్‌గా వ్యవహరించిన సఫ్దర్ నఘోరీ, అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌఖీర్‌లకు దగ్గరయ్యాడు. 2007లో గుజరాత్‌లోని వడోదర సమీపంలోని హలోల్ జరిగిన సిమి ఉగ్రవాద శిక్షణ శిబిరంలో పాల్గొన్న ఆఫ్రిది.. మిగిలిన 30 మంది కంటే ‘ఉత్తమమైన ప్రతిభ’ కనబరిచాడు. సిమి మాడ్యుల్‌తో పాటు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థలోనూ చేరాడు. అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో టెలిఫోన్‌బూత్ ఆపరేటర్‌గా పనిచేస్తుండగా.. ఐఎంకు చెందిన ఉగ్రవాది ఖయాముద్దీన్ కపాడియా రూ.6 వేలు ఇతడికి ఇచ్చి ఓ సైకిల్ ఖరీదు చేసుకురమ్మన్నాడు. అలా తీసుకువచ్చిన దానిపై బాంబు బిగించి ఆఫ్రిదీ చేతనే డైమండ్ మార్కెట్ వద్ద పెట్టించాడు. 2008లో బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ తర్వాత ఐఎం మాడ్యుల్ గుట్టురట్టు కావడంతో ఆఫ్రిది అజ్ఞాతంలోకి వెళ్లిపోయి తన విధ్వంసాలు కొనసాగించాడు.

 

 
హాలిడే రోజు స్వస్థలానికి..

దాదాపు ఎనిమిదేళ్లుగా స్వస్థలానికి దూరంగా ఉన్న అఫ్రిదీకి తన ఊరు, ఇల్లు, తల్లి, చెల్లి సెంటిమెంట్ పోలేదు. దీంతో పాత జ్ఞాపకాలు నెమరువేసుకునేందుకు గతేడాది అక్కడకు వెళ్లాడు. అయితే మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న తనను పట్టుకోవడానికి నిఘా, పోలీసు వర్గాలు నిత్యం వేటాడటంతో పాటు అనేకచొట్ల కన్నేసి ఉంటాయనే అనుమానంతో జాగ్రత్తలు తీసుకున్నాడు. గుజరాత్‌లో సెలవుదినమైన ‘ఉత్తరాయణ్ డే’ నేపథ్యంలో 2015 జనవరి 14న జోహాపురకు వెళ్లాడు. న్యూ ఆషియానా పార్క్, సన్‌ఫ్లవర్ స్కూల్, వెజల్పూర్‌లోని స్కూళ్ల వద్ద సంచరిస్తూ నాటి స్మృతులు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంటికి వెళ్తే తన కదలికల్ని ఏజెన్సీలు గుర్తించే అవకాశం ఉందని భయపడ్డాడు. దీంతో లోపలకు వెళ్లకుండా తన ఇంటి సమీపంలో తచ్చాడుతూ తల్లి గొంతు విన్నాడు. ఆపై అక్కడ నుంచి నిష్ర్కమించి 2008లో ఆత్మహత్య చేసుకున్న సోదరిని ఖననం చేసిన శ్మశానం వద్దకు వెళ్లాడు. అక్కడ తన చెల్లి సమాధి గుర్తించడం సాధ్యం కాకపోవడంతో భారీగా పుష్ఫగుచ్ఛాలు తీసుకుని దాదాపు అన్ని సమాధుల మీదా పెట్టాడు. ఆపై తన షెల్టర్ జోన్ బెంగళూరు చేరుకున్నాడు. ఆఫ్రిదిని కస్టడీలోకి తీసుకుని విచారించిన అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆ విషయాలు తెలుసుకుని ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement