రూ.73,562 కోట్ల పెట్టుబడులు
రూ.73,562 కోట్ల పెట్టుబడులు
Published Mon, Aug 21 2017 1:47 AM | Last Updated on Sun, Sep 17 2017 5:45 PM
‘టీఎస్–ఐపాస్’ కింద రాష్ట్రంలో వెల్లువ
- తొలిరెండు స్థానాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు
- రూ.8,331 కోట్లతో తొలిస్థానంలో జెన్‌కో
- పరిశ్రమల ఏర్పాటులో గ్రామీణ జిల్లాల వెనుకబాటు
సాక్షి, హైదరాబాద్: కొత్త పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘టీఎస్–ఐపాస్’పాలసీ కింద పెట్టుబడులు వెల్లువెత్తాయి. రూ.73,562.56 కోట్ల పెట్టుబడులతో 3,973 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) రూ.8,331 కోట్ల పెట్టుబడులతో అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) రూ.7,846.01 కోట్ల పెట్టుబడులతో రెండో స్థానంలో నిలిచింది. అలాగే ఖాయిలా పడిన రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ కోసం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సీఐఎల్) రూ.3,160 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి పొందింది. ఈ పరిశ్రమను కలుపుకుంటే ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులు రూ.19,337 కోట్లకు పెరిగాయి.
అగ్రస్థానంలో రంగారెడ్డి.. అట్టడుగున జగిత్యాల
జిల్లాల వారీగా పరిశీలిస్తే గత రెండేళ్ల కాలంలో రూ.10,587 కోట్ల పెట్టుబడులతో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలవగా, కేవలం రూ.26.02 కోట్ల పెట్టుబడులతో జగిత్యాల అట్టడుగు స్థానంలో నిలిచింది. రూ.9,387 కోట్ల పెట్టుబడులతో కొత్తగూడెం జిల్లా రెండో స్థానంలో నిలవగా, రూ.7,872 కోట్ల పెట్టుబడులతో పెద్దపల్లి, రూ.6,166 కోట్ల పెట్టుబడులతో సంగారెడ్డి, రూ.5,686 కోట్ల పెట్టుబడులతో మంచిర్యాల, రూ.5,476 కోట్ల పెట్టుబడులతో ఖమ్మం జిల్లాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రూ.37.56 కోట్లతో ఆసిఫాబాద్, రూ.42.85 కోట్లతో భూపాలపల్లి, రూ.59.05 కోట్లతో మహబూబాబాద్, రూ.79.32 కోట్లతో వరంగల్ రూరల్ జిల్లాలు జాబితాలో అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. పరిశ్రమల స్థాపనలో గ్రామీణ జిల్లాలు వెనకబడిపోయాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
2,50,843 మందికి ఉపాధి
టీఎస్–ఐపాస్ కింద ఇప్పటి వరకు అనుమతి పొందిన 3,973 పరిశ్రమల ద్వారా 2,50,843 మందికి ఉపాధి లభించనుందని ప్రభుత్వం చెబుతోంది. ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో రూ.3,338.87 కోట్ల పెట్టుబడులతో కేవలం 8 పరిశ్రమలు మాత్రమే అనుమతులు పొందగా, వాటి ద్వారా ఏకంగా 45,900 మందికి ఉపాధి లభించనుంది. అలాగే రూ.2,645.18 కోట్ల పెట్టుబడులతో 535 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అనుమతులు జారీ కాగా, వీటి ద్వారా 31,889 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.
విద్యుత్ రంగంలో రూ.18,539 కోట్లు
పెద్దపల్లి జిల్లా రామగుండంలో రూ.7,846.01 కోట్ల పెట్టుబడితో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ కోసం ఎన్టీపీసీ టీఎస్–ఐపాస్ కింద అనుమతులు పొందగా, తెలంగాణ జెన్‌కో రూ.5,291.15 కోట్ల పెట్టుబడులతో ఖమ్మం జిల్లా మణుగూరులో 1,080 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం, రూ.3,040 కోట్ల పెట్టుబడులతో జనగామ జిల్లాలో 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం అనుమతి తీసుకుంది. పరిశ్రమల కేటగిరీల వారీగా చూసినా పెట్టుబడుల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలే పైచెయ్యి సాధించాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కోసం రూ.18,539 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం.
Advertisement
Advertisement