సంస్కృతం ‘ఆప్షన్’తొలగింపు సాధ్యమేనా?
ఇంటర్‌లో ద్వితీయ భాషలుగా సంస్కృతం, తెలుగు, ఇతర భాషలు
- బోర్డు నిబంధనల ప్రకారం ఎంపిక స్వేచ్ఛ విద్యార్థులదే
- ఇప్పుడు తెలుగును తప్పనిసరి చేయాలంటే వాటిని మార్చాల్సిందే
- విద్యా సంవత్సరం మధ్యలో ఇది సాధ్యంకాదంటున్న అధికారులు
- వచ్చే ఏడాది నుంచే అమలు చేసేందుకు అవకాశం
- ప్రస్తుతం రాష్ట్ర సిలబస్‌లో టెన్త్ వరకు తెలుగు తప్పనిసరి సబ్జెక్టు
- సీబీఎస్‌ఈ స్కూళ్లలో అమలుకు కేంద్రం అనుమతి కావాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియెట్) వరకు తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై విద్యా శాఖ పరిశీలన జరుపుతోంది. ఇప్పటికే రాష్ట్ర సిలబస్‌లో పదో తరగతి వరకు తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ఉన్నందున అక్కడి వరకు ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. కానీ ఇంటర్మీడియెట్‌లో (11, 12 తరగతుల్లో) తెలుగు భాష సబ్జెక్టును కచ్చితంగా అమలు చేయడం సులభం కాదని స్పష్టం చేస్తున్నారు.
ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం... ఇంటర్మీడియెట్‌లో ప్రథమ భాషగా ఇంగ్లిష్ సబ్జెక్టు తప్పనిసరి. ద్వితీయ భాష సబ్జెక్టుగా తెలుగు, సంస్కృతంతోపాటు పలు ఇతర భాషలను (వీలును బట్టి) ఎంచుకునేందుకు విద్యార్థులకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏటా ఇంటర్ చదువుతున్న విద్యార్థుల్లో దాదాపు 6 లక్షల మంది ద్వితీయ భాషగా సంస్కృతం సబ్జెక్టును ఎంచుకుంటుండగా.. 2 లక్షల మంది తెలుగును, మరో లక్ష మంది వరకు ఉర్దూను ఎంచుకుంటున్నారు. మరికొందరు ఇతర భాషలను ద్వితీయ భాష సబ్జెక్టుగా తీసుకుంటున్నారు.
స్కోరింగ్ సబ్జెక్టును వదులుకుంటారా?
ఇంటర్‌లో ద్వితీయ భాషగా చాలా మంది విద్యార్థులు సంస్కృతాన్ని ఎంచుకోవడానికి కారణం.. దానిలో ఎక్కువగా మార్కులు పొందడానికి వీలుకావడమే. దీనికితోడు నిబంధనల ప్రకారం.. ద్వితీయ భాష ఎంపికలో విద్యార్థులకు అవకాశం ఉండడంతో సంస్కృతాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేని పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆప్షన్‌ను తొలగించి.. తెలుగును తప్పనిసరి సబ్జెక్టు చేయడం సాధ్యమేనా అన్న దిశగా తర్జనభర్జన సాగుతోంది. ఇదే జరగాలంటే ఇంటర్ బోర్డు నిబంధనల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వ స్థాయిలో చర్చ జరిగాకే తుది నిర్ణయం వెలువడనుంది.
వచ్చే ఏడాది నుంచే అమలు
నిబంధనల ఇబ్బందులూ తొలగిపోయినా.. తెలుగును ఇప్పటికిప్పుడే తప్పనిసరి సబ్జెక్టు చేయడం సాధ్యం కాదని, వచ్చే ఏడాది నుంచే అమల్లోకి తీసుకురాగలమని అధికారులు అంటున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో మార్పులు చేయడం వీలుకాదని, వచ్చే ఏడాది నుంచి అమలుకు వీలవుతుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ)’సిలబస్‌ను అనుసరించే స్కూళ్లలో తెలుగును సబ్జెక్టుగా చేర్చడంపైనా అధికారులు దృష్టిపెట్టారు. కానీ ఇందుకు కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉండనుంది. దీంతో కేంద్రం ఆమోదం కోసం సీబీఎస్‌ఈకి లేఖ రాయాలని విద్యాశాఖ భావిస్తోంది. సీబీఎస్‌ఈ అంగీకరిస్తేనే ఆయా స్కూళ్లలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఐసీఎస్‌ఈ సిలబస్‌ను అనుసరించే స్కూళ్లలో అమలుకు కూడా ఇదే పరిస్థితి ఎదురుకానుంది.