
కాంట్రాక్టర్ల కోసమా?
► అలాంటి తెలంగాణ వద్దు: కోదండరాం
► జయశంకర్ బాటలో పోరాడతాం
► సార్‌ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి
► అందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రజల్లోకి జేఏసీ
►నాకు రాజకీయ ఆకాంక్షలేవీ లేవు
► జయశంకర్ వర్ధంతి సభల్లో వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునే వాళ్లకు లబ్ధి చేకూర్చడానికే పరిమితమయ్యే తెలంగాణ వద్దని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు తదితర వర్గాలతో పాటు సబ్బండ వర్ణాల అభివృద్ధి కోసం రాజకీయ జేఏసీ మళ్లీ క్రీయాశీలక పాత్ర పోషిస్తూ భావి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్తుందని ప్రకటించారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ ఐదో వర్ధంతి సందర్భంగా మంగళవారం తెలంగాణ జేఏసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జయశంకర్ సార్ తెలంగాణ సాధనకు తన జీవితాన్ని త్యాగం చేశారంటూ కొనియాడారు. రాష్ట్రం వచ్చాక అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించాలని కాంక్షించిన ఆయన లేకపోవడం తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు.
మలి దశ ఉద్యమంలో ఎంతోమందిని తెలంగాణ వైపు మళ్లించిన ఘనత సార్‌దేనని చెప్పారు. ‘‘మనుషులు శాశ్వతం కాదు. వారి ఆలోచనా విధానాలు, భావాలు శాశ్వతం. తెలంగాణ సాధించడం ఒక ఎత్తై, అభివృద్ధి చేసుకోవడం మరో ఎత్తని జయశంకర్ సార్ భావించేవారు. ప్రజలందరూ అభివృద్ధి చెందాలని, తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలు అట్టడుగు వర్గాలకు చెందాలనేది ఆయన ఆశయం. తెలంగాణ అభివృద్ధి కోసం మరింత సంఘటితంగా ప్రయత్నించాలని చెప్పిన సార్ బాటలోనే అభివృద్ధి కోసం సంఘటిత పోరాటాలు చేస్తాం. వివిధ అంశాలపై తొందరపడి ఏ విషయమూ మాట్లాడబోం. సమగ్రంగా అధ్యయనం చేసి, లోతుగా పరిశీలించాకే మాట్లాడతాం’’ అని కోదండరాం స్పష్టం చేశారు.
ట్యాంక్‌బండ్ విగ్రహాల కూల్చివేతలను సమర్థించారు
జయశంకర్‌ను తెలంగాణ జాతి పితగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఆగస్టు 6న ఆయన జయంతి వేడుకల నాటికి దీనిపై అధికారికంగా ప్రకటన చేయాలన్నారు. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ నాయకులు ప్రతిపాదించిన తీర్మానాన్ని కోదండరాం ఆమోదించారు. ఈ తీర్మానాన్ని ఊరూరా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం ఓయూ విద్యార్థి జేఏసీ, టీఎస్ జాక్ ఆధ్వర్యంలో ఓయూ లైబ్రరీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మిలియన్ మార్చ్ కార్యక్రమంలో భాగంలో ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను కూల్చివేయడాన్ని జయశంకర్ సమర్థించారని చెప్పారు. ‘‘మార్చ్‌లో ఆయన పాల్గొనలేదు. అదెలా జరిగిందో చెబుదామని సాయంత్రం వాళ్లింటికి వెళ్లాను.
ట్యాంక్‌బండ్ విగ్రహాల ధ్వంసం గురించి ఆయనతో మాట్లాడేందుకు భయపడ్డాం. అయితే, మిలియన్ మార్చ్ బాగా జరిగిందని ఆయనన్నారు. తానూ వద్దామని బయల్దేరినా అక్కడి పరిస్థితుల దృష్ట్యా వద్దనడంతో ఆగిపోయానన్నారు. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలొద్దని అప్పటి సీఎం ఎన్టీఆర్‌కు వినతిపత్రం సమర్పించినా విన్లేదని, వాటిని ధ్వంసం చేయడం మంచిదేనని అన్నారు’’ అని వివరించారు. రాష్ట్ర సాధనకు ఎంత కష్టపడుతున్నామో ఆ తర్వాత ఈ ప్రాంత, ప్రజల అభివృద్ధికి కూడా అంతకంటే ఎక్కువ కృషి చేయాలని సార్ అనేవారన్నారు. తనకు ప్రత్యేక రాజకీయ ఆకాంక్షలేవీ లేవని కోదండరాం పునరుద్ఘాటించారు. ‘‘నావి ఎవరో అనిపిస్తే అంటున్న మాటలు కాదు. తెలంగాణ సమాజమే నా మాటాలకు కారణం. రాష్ట్రంలో కోటి మంది నిరుద్యోగులున్నారు. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 18-35 ఏళ్ల యువకులు 20 లక్షల మంది ఉన్నారు.
ఇక పది, ఇంటర్ అయినవారు 80 లక్షల దాకా ఉంటారు. వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’’ అన్నారు. డీఎస్సీ, గ్రూప్-2 ఉద్యోగాలను త్వరగా భర్తీ చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఊరురా దొరల పాలన తెచ్చేందుకే గడీలను మరమ్మతులు చేస్తున్నారని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ డాక్టర్ చెరుకు సుధాకర్ ఆరోపించారు. గడీల్లో దొరల పాలనను సాగనివ్వబోమని హెచ్చరించారు. అభివృద్ధిపై తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతూ కేసీఆర్ పాలన కొనసాగుతుందని జస్టిస్ చంద్రకుమార్ తప్పుబట్టారు. కార్యక్రమాల్లో ఓయూ అధ్యాపకులు ప్రొఫెసర్లు విశ్వేశ్వర్‌రావు, ఇటిక్యాల పురుషోత్తం, జేఏసీ నేతలు పిట్టల రవీందర్, ప్రహ్లాదరావు, విద్యార్థి జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు.