పాఠ్యాంశంగా ఈశ్వరీబాయి చరిత్ర
సాక్షి, హైదరాబాద్: ‘‘బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం, సంక్షేమం కోసం మాజీ మంత్రి ఈశ్వరీబాయి రాజీలేని పోరాటం చేశారు. ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేరుస్తాం. తద్వారా భావితరాలు స్ఫూర్తి పొందేలా చూస్తాం’’అని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. భాషా సాంస్కృతిక శాఖ , ఈశ్వరీబాయి స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఈశ్వరీబాయి జయంతి వేడుకల్లో కడియం, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధి, దళిత వర్గాల స్థితిగతుల వంటి పలు అంశాలపై 100కు పైగా అధ్యయనాలు చేసిన రీసెర్చ్ స్కాలర్ ఐసీఎస్‌ఎస్‌ఆర్ చైర్మన్, సుఖదేవో థోరట్‌కు ఈశ్వరీబాయి స్మారక అవార్డు-2016ను ప్రదానం చేశారు.
వచ్చే ఏడాది ఈశ్వరీబాయి శతజయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా కడియం ప్రకటించారు. దళిత, బడుగు బలహీన, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న ఈశ్వరీబాయి ఆలోచనలకు అనుగుణంగానే 254 గురుకుల పాఠశాలలు, ఎస్సీ మహిళల కోసం 30 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ప్రారంభించామని చెప్పారు. తల్లి ఈశ్వరీబారుు ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్లేందుకు మాజీ మంత్రి గీతారెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన దళిత వర్గాల బిడ్డ ఈశ్వరీబాయి అని చందూలాల్ కొనియాడారు.
ఉద్యమంలో తాను సైతం: గీతారెడ్డి
తన తల్లి ఈశ్వరీబాయి తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని జైలుకెళ్లిందని ఈ సందర్భంగా గీతారెడ్డి గుర్తు చేసుకున్నారు. ‘‘నా తల్లి రాజకీయ జీవితం 1957లో హైదరాబాద్ చిలకలగూడ నుంచి మొదలైంది. తర్వాత వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మహిళా సాధికారితతో పాటు బడుగు బలహీన, దళిత వర్గాల కోసం ఆమె చేసిన పోరాటం మరవలేనిది. తన మాటలతో అధికారపక్షం గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన వీరవనిత మా అమ్మ. తనే నాకు స్ఫూర్తి’’అని వివరించారు. అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకున్న ఈశ్వరీబాయి కలలుగన్న అభ్యున్నతి కోసం ముందుకెళ్లినప్పుడే ఈ జయంత్యుత్సవాలకు సార్థకత అని థోరట్ అన్నారు. అందరికీ స్ఫూర్తిగా నిలిచేలా ఆమె స్ఫూర్తిదాయక జీవిత చరిత్రను మరింతగా వెలుగులోకి తేవాల్సిన అవసరముందన్నారు. వందనాలు వందనాలు అంటూ ఈశ్వరీబాయిపై ఎమ్మెల్యే రసమరుు బాలకిషన్ పాడిన పాట రంజింపచేసింది. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు.