
ఏదీ నిర్భయం?
=ఐటీ కారిడార్‌ను వణికిస్తున్న క్యాబ్‌లు
=చాలా వాహనాల వివరాలు ‘బోగస్’
=పక్కా చిరునామాలు ఆర్టీఏలోనూ నిల్
= పటిష్ట చర్యలకు వెనకాడుతున్న పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: రాజధాని ఐటీ కారిడార్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినులకు భద్రత లేకుండా పోయింది. వారికి రక్షణ కరువవుతోంది. శుక్రవారం నాటి ఘటన నేపథ్యంలో... సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగినులు క్యాబ్, ఆటోలు అంటేనే వణికిపోతున్నారు. అయినప్పటికీ క్యాబ్‌లు, ఆటో డ్రైవర్లపై నిఘా కరువైంది. కారణమేమిటంటే.. ఆటోలు, క్యాబ్‌లకు సంబంధించిన పక్కా వివరాలు లేకపోవడమే అన్న సమాధానం అధికారుల నుంచి వినవస్తోంది. అందువల్లే ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాజధానిలో దాదాపు 70 వేలకు పైగా ఆటోలు, 40 వేల వరకు క్యాబ్స్ ఉండగా... ఆర్టీఏ రికార్డుల్లో కనీసం 50 శాతం కూడా అసలైన చిరునామాలపై లేవు. ఫలితంగా ఏదైనా ఉదంతం జరిగినప్పుడు దర్యాప్తులో అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. జంట కమిషనరేట్ల వ్యాప్తంగా రిజిస్టర్ అయిన ఆటోలు, క్యాబ్‌లు ఎన్ని ఉన్నాయి..? వాస్తవానికి ఎన్ని సంచరిస్తున్నాయి? అంటూ ఆర్టీఏ అధికారుల్ని అడిగితే ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి.
నగరంలో డబుల్ రిజిస్ట్రేషన్ నెంబర్, బోగస్ నంబర్ ప్లేట్లతో తిరుగున్న వాహనాలు అనేకం ఉంటాయని పోలీసులే అంగీకరిస్తున్నారు. ఆర్టీఏలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న ఆటో/క్యాబ్ డ్రైవర్లు, యజమానులు అందిస్తున్న పత్రాల విశ్వసనీయత, చిరునామా పక్కానా? కాదా? అనేవి క్రాస్ చెక్ చేసేందుకు ఆర్టీఏ వద్ద వనరులు లేవు. పోనీ నగరవ్యాప్తంగా విస్తృత దాడులు చేసి ఇలాంటి వాటికి చెక్ చెప్పాలన్నా... ఉన్న సిబ్బందితో రోటీన్ పనులే కష్టంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేరాలకు కారణమవుతున్న ఆటోలకు అన్ని వేళలా చెక్ చెప్పడం సాధ్యం కాదన్నది స్పష్టమవుతోంది. ఈ పరిణామాలే అనేక సందర్భాల్లో నేరగాళ్లకు కలిసి వస్తున్నాయి.
పత్తాలేని ప్రత్యేక నంబరింగ్
ఆర్టీఏలో పరిస్థితులు ఈ రకంగా ఉంటే... పోలీసుల దుస్థితి మరోలా ఉంది. నగరంలో సంచరిస్తున్న ఆటో/క్యాబ్‌లకు సంబంధించిన రికార్డులు పక్కాగా నిర్వహించాలన్న ఆలోచన వారికి రాదు. గతంలో ఈ విధానాన్ని ప్రారంభించినా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. విజయవాడతో పాటు ఇతర పట్టణాలకు చెందిన పోలీసులు ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉన్నారు. తమ పరిధుల్లో తిరిగే ఆటోలు, ట్యాక్సీల యజమానులు, డ్రైవర్లకు చెందిన పూర్తి రికార్డులు తమ వద్ద నిర్వహిస్తున్న పోలీసులు వాటికి ప్రత్యేక నంబర్లు ఇచ్చారు. ఇవి ఆటోలో ఎక్కే వారి భద్రతతో పాటు ఉల్లంఘనలకు చెక్ చెప్పేందుకూ ఉపకరిస్తున్నాయి. నగరంలోని ఆటోల్లో ఉన్న ‘లొసుగులు’ తెలిసినప్పటికీ జంట కమిషనరేట్ల అధికారులు ఆ కోణంలో ఆలోచించకుండా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ఆరంభ శూరత్వమే...
నగర కమిషనరేట్ పరిధిలో సంచరించే ఆటోల్లో డ్రైవర్లు తమ వివరాలతో పాటు పోలీసు హెల్ప్‌లైన్‌తో కూడిన బోర్డును ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ విభాగం అధికారులు రెండేళ్ల క్రితం ఆదేశించారు. దీన్ని ఆటోలో కూర్చున్న వారికి కనిపించేలా డ్రైవర్ సీటు వెనుక ఏర్పాటు చేయాలని సూచించారు. వీటిపై ఆటోఓనర్ పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్, ట్రాఫిక్ హెల్ప్‌లైన్, కంట్రోల్‌రూమ్ నంబర్లను అందుబాటులో ఉంచాలన్నారు. దీంతో పాటు ఆటో వెనుక భాగంలో లోపలి ప్రదేశం పాదర్శకంగా కనిపించేలా ఓపెన్‌గా ఉండాలని స్పష్టం చేశారు. వీటిపై తొలినాళ్లలో హడావుడి చేసిన అధికారులు ఆపై మర్చిపోయారు. ఇప్పుడు బోర్డులు మాయం కాగా... వెనుక భాగంలో ఆటోయాడ్స్ ప్రత్యక్షమవుతున్నాయి. ఆటోల విషయంలో కనీసం ఈ తరహా చర్యలు తీసుకున్న అధికారులు క్యాబ్‌లపై మాత్రం ఎలాంటి దృష్టి పెట్టలేదు. కనీసం ప్రాథమికమైన అంశాలనూ పట్టించుకోలేదు.
పటిష్ట చర్యలతోనే భద్రతకు వీలు
ప్రయాణికుల భద్రత కోసం ఉద్దేశించిన ఈ బోర్డుల స్థానంలో నేమ్‌షీట్లు ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. కొందరు ప్రయాణికులు తాము దారుణాలకు గురైన, మోసపోయిన ఆటోడ్రైవర్‌పై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక మిన్నకుండి పోతున్నారు. క్యాబ్‌ల విషయంలో అసలు ఎలాంటి నిబంధనలూ లేకుండా పోయాయి. ఇకనైనా పోలీసులు మేల్కొని ఓనర్ ఫోటో, వ్యక్తిగత ఫోన్ నెంబరు, చిరునామా, హెల్ప్‌లైన్, పోలీసులకు సంబంధించిన నెంబర్లు తదితరాలు ఆంగ్ల, తెలుగు, ఉర్దూలో ఉండేలా వాహనాల్లో బోర్డులు ఏర్పాటయ్యేలా చూడాలి. ఆటోలు, క్యాబ్‌లకు ప్రత్యేక నంబర్లు కేటాయించడంతో పాటు అవి వాహనం ముందు, వెనుక, లోపలే కాకుండా టాప్‌పైన కూడా రాసేలా చర్యలు తీసుకోవాలి. ఫలితంగా ఆ వివరాలు రహదారులు, జంక్షన్లలో ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అవుతాయి.
స్వీయ జాగ్రత్తలే మేలు
మారిన జీవన విధానం నేపథ్యంలో మహిళలు సైతం పురుషులతో సమానంగా విద్య, ఉద్యోగ రంగాల్లో దూసుకుపోతున్నారు. దీంతో అనివార్యంగా వేళలతో సంబంధం లేకుండా రహదారుల్లో సంచరించాల్సి ఉంటోంది. ఈ నేపథ్యంలో ముష్కరుల బారిన పడకుండా కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
=విద్యార్థినులు, ఉద్యోగినులు పోకిరీలు, ముష్కరులకు చెక్ చెప్పడానికి వీలుగా హ్యాండ్‌బ్యాగ్‌లో పెప్పర్ స్ప్రేను వెంట ఉంచుకోవాలి.
=పెప్పర్ స్ప్రే అందుబాటులో లేకుంటే కనీసం ఘాటైన వాసన గల సెంట్లు, స్ప్రేలు దగ్గర ఉంచుకోవాలి.
=ఎవరైనా దాడి చేసినా, వేధించినా, ఘోరాలకు యత్నించినా వీటిని వారి ముఖంపై స్ప్రే చేసి తప్పించుకోవచ్చు.
=రాత్రి వేళల్లో, నిర్జన ప్రదేశాల్లో సాధ్యమైనంత వరకు మహిళలు ఒంటరిగా సంచరించకపోవడమే మంచిది.
=తప్పనిసరి పరిస్థితుల్లో సంచరించే మహిళలు తమతో పాటు ఓ విజిల్‌ను ఉంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో దీన్ని ఊదుతూ చుట్టపక్కల వారిని అలర్ట్ చేయవచ్చు.
=స్థానిక పోలీసుస్టేషన్, కంట్రోల్ రూమ్‌తో పాటు సన్నిహితుల నెంబర్లు సెల్‌ఫోన్‌లోని స్పీడ్ డయల్స్ ఆప్షన్‌లో సేవ్ చేసుకోవాలి. అవసరమైతే వాటిని సేవ్ చేసిన బటన్ నొక్కిన వెంటనే అవతలి వారికి కాల్ వెళ్తుంది.
=మహిళలు ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మహిళా ప్రయాణికులు ఉన్న షేర్ ఆటోలు, క్యాబ్‌లే ఎక్కడం ఉత్తమం.
=తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరిగా అద్దె వాటిలో వెళ్లాల్సి వస్తే అది ఎక్కే ముందు దాని నెంబర్, డ్రైవర్ పేరు అడిగి తెలుసుకుని వాటిని సన్నిహితులు, స్నేహితులకు సంక్షిప్త సందేశం, ఫోన్‌కాల్ ద్వారా తెలపాలి.
=సన్నిహితులు, స్నేహితులు, కుటుంబీకులు సమీపంలో లేని వారు కనీసం పోలీసు కంట్రోల్ రూమ్ (100)కు ఫోన్ చేసి విషయం చెప్పాలి. ఈ విషయం ఆ డ్రైవర్‌కు తెలిసేలా చేస్తే అతను దుస్సాహసాలకు ఒడిగట్టే ధైర్యం చేయడు.
=మహిళలు, యువతులు వ్యక్తిగత పనులపై ఒంటరిగా బయటకు వస్తే ఎక్కడెక్కడకు వెళ్లాలనుకుంటున్నారో ముందుగానే సంబంధీకులకు తెలపాలి.