హైదరాబాద్: ఆటోలు, క్యాబ్‌లు ప్రయాణికులను ఠారెత్తిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆటోవాలాలు, క్యాబ్‌వాలాలు చార్జీలను రెట్టింపు చేసి ప్రయాణికులపైన నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. మరోవైపు బుకింగ్‌లలోనూ తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుంది. అత్యవరస పరిస్థితుల్లో క్యాబ్‌లను ఆశ్రయించే వారు గంటల తరబడి పడిగాపులు కాయవలసి వస్తోంది. చివరి నిమిషంలో క్యాబ్ బుక్ అయినా డబుల్ చార్జీలు చెల్లించుకోవలసి వస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో అనేక చోట్ల రహదారులు జలమయమయ్యాయి.
దీంతో ప్రజారవాణా అస్తవ్యవస్థమైంది. పలు మార్గాల్లో సిటీ బస్సుల రాకపోకలకు సైతం అంతరాయం కలిగింది. దీంతో ఉదయాన్నే విధులకు వెళ్లవలసిన ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించారు. సాధారణ రోజుల్లో తార్నాక నుంచి సికింద్రాబాద్‌కు ఆటోలో వెళ్లేందుకు రూ.120 కంటే ఎక్కువ ఉండదు. కానీ మంగళవారం ఏకంగా రూ.250 వరకు చెల్లించవలసి వచ్చినట్లు రమేష్ అనే ప్రయాణికుడు తెలిపారు.
బోడుప్పల్ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు ఓలా ఆటో సాధారణంగా అయితే రూ.60 నుంచి రూ.80కి లభిస్తుంది. కానీ వర్షం కారణంగా ఏకంగా రూ.150 దాటింది. ఇక సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, బేగంపేట్, తదితర రైల్వేస్టేషన్‌లకు చేరుకున్న దూరప్రాంత ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
అమాంతంగా పెరిగిన క్యాబ్ చార్జీలు...
సాధారణ రోజుల్లోనే ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్ పేరిట క్యాబ్ సంస్థలు అడ్డగోలుగా చార్జీలు పెంచేస్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో క్యాబ్‌ల కొరతను సాకుగా చూపుతూ చార్జీలను రెట్టింపు చేశారు. తార్నాక నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వరకు సాధారణ రోజుల్లో రూ.450 నుంచి రూ.500 వరకు ఉంటే మంగళవారం ఇది రూ.870 కి చేరినట్లు ఒక ప్రయాణికుడు విస్మయం వ్యక్తం చేశారు. ఐటీ నిపుణులు, ఉద్యోగులు, ఉదయం పూట ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు వెళ్లే ఉద్యోగుల ఒత్తిడి కారణంగా క్యాబ్‌లకు డిమాండ్ పెరిగింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి అమీర్‌పేట్ వరకు రూ.1650 వరకు వసూలు చేసినట్లు ఒక ప్రయాణికురాలు విస్మయం వ్యక్తం చేశారు.
మెట్రో కిటకిట...
మెట్రో రైళ్లకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. వర్షం దృష్ట్యా చాలామంది మెట్రో రైళ్లను ఆశ్రయించారు. నాగోల్–రాయదుర్గం, ఎల్‌బీనగర్–మియాపూర్ రూట్‌లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ఉదయం, సాయంత్రం ఎక్కువ మంది మెట్రోలపైన ఆధారపడి ప్రయాణం చేశారు. దీంతో రెండు రోజులుగా మెట్రో ప్రయాణికుల సంఖ్య సుమారు 5.50 లక్షలకు చేరినట్లు అంచనా. ప్రతి 3 నిమిషాలకో మెట్రో రైలు నడిపించారు.
Comments
Please login to add a commentAdd a comment