రోదిస్తున్న లక్ష్మి కూతుళ్లు
ముషీరాబాద్: నాలుగు రోజుల క్రితం కవాడిగూడ దామోదర సంజీవయ్య నగర్ బస్తీలో ప్రమాదవశాత్తు హుస్సేన్‌సాగర్ నాలాలో పడి కొట్టుకుపోయిన లక్ష్మి మృతదేహం బుధవారం ముసారాంబాగ్ నాలాలో లభ్యమైంది. స్థానిక పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది మొదట మహిళ మృతదేహం ఉందని గాంధీనగర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు లక్ష్మి కుటుంబ సభ్యులను పిలిపించారు.
లక్ష్మి చేతిపైన ఉన్న కమల అనే పచ్చబొట్టు, ముక్కుపుడక ఆధారంగా ఆమెను గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్ తదితరులు లక్ష్మి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కాగా లక్ష్మి చనిపోయిందని తెలిసి కుటుంబ సభ్యులు, కూతుళ్లు బోరున విలపించారు.
జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే లక్ష్మి చనిపోయిందని, బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సీపీఎం నగర కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్, ముషీరాబాద్ నియోజకవర్గం జోన్ కార్యదర్శి దశరథ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు బాధితులకు ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాలుగా హుస్సేన్‌సాగర్ నాలాకు ప్రహరీ నిర్మించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment