► నగర రహదారులపై వరద చేరడంతో వాహనాలు బారులుతీరి భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఎర్రగడ్డ మెయిన్ రోడ్డుపై భారీగా వరద రాకపోకలకు అంతరాయం కలిగించింది. మూసాపేట నుంచి అమీర్ పేట వరకు, కూకట్ పల్లి వై జంక్షన్ నుంచి కూకట్‌పల్లి వరకు మొత్తం ట్రాఫిక్ స్తంభించింది. మధ్యాహ్నం వరకు పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
► శంషాబాద్ వెళ్లే దారిలో మంచిరేవుల వద్ద నార్సింగ్ ఓఆర్‌ఓ పక్కన భారీ కొండ చరియ నుంచి మట్టి కరిగిపోవడంతో బండరాళ్లు దొర్లిపడ్డాయి. బండరాళ్లు రోడ్డు అంచు వరకు వచ్చి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఉద్ధృతంగా మూసీ..
జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కి భారీగా వరద వచ్చి చేరుతోంది. గేట్లు ఓపెన్ చేసి దిగువన వరదనీరు విడుదల చేస్తుండటంతో మూసీలోకి ఉద్ధృతి పెరిగింది. మూసారాం బాగ్ – అంబర్ పేట బ్రిడ్జి పై నీరు నిలవడంతో మూసీలోకి మళ్లించారు. బల్దియా అధికారులు మూసీ పరివాహక ప్రాంతాలు అలర్ట్‌గా ఉండాలంటూ హెచ్చరిక జారీ చేశారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అంటూ మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు .
కుండపోతగా.. మహానగర పరిధిలో
మంగళవారం తెల్లవారుజామున కుండపోత వర్షం రికార్డు సృష్టించింది. రాత్రి నుంచి ఉదయం 8 గంటల వరకు మియాపూర్‌లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్లు.. కూకట్‌పల్లి 14.3, శివరాంపల్లి 13, గాజుల రామారావు 12.5, బోరబండ 12.5, జీడిమెట్ల 12.1, షాపూర్, మూసాపేట్, జూబ్లీహిల్స్ 12, కుత్బుల్లాపూర్ 11.5, మాదాపూర్ 11.4, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ 11.2, బేగంపేట్, కేపీహెచ్‌బీ, అల్వాల్, శేలింగంపల్లి 10, ముషీరాబాద్ 9.9, గోషామహల్ 9.5, మలక్‌పేట్ 9.4, ఫలక్‌నుమా 9.2, కార్వాన్ 8.8, సరూర్‌నగర్ 7.9, ఎల్బీనగర్, అంబర్‌పేట్ 6.6, మల్కాజిగిరి, మౌలాలిలో 4.7 సెంటిమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల వరకు పలు ప్రాంతాల్లో 5.9 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment