హిమాయత్‌నగర్: నగర ప్రజల ప్రాణాలను రక్షించడమే తమకు అత్యంత ప్రధానమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సెలవులు ఉన్నాయి కదా అని ఎవరూ బయటకు రావొద్దంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజల అవసరాల కోసం, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నగర వ్యాప్తంగా జీహెచ్‌ఎంసీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది కలిసికట్టుగా పని చేస్తున్నారన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా గ్రీవెన్స్, ట్విట్టర్, టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. ఇందుకోసం నగర వ్యాప్తంగా 429 రెస్క్యూ టీంలు పని చేస్తున్నాయన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను మేయర్ శనివారం సందర్శించారు. కంట్రోల్ రూమ్‌కు వస్తున్న ఫోన్ కాల్స్, ఇతర ఫిర్యాదుల పట్ల సిబ్బంది పనితీరు ఎలా ఉందనే విషయాల్ని ఆమె దాదాపు గంట సేపు సమీక్షించారు.
రూ.780 కోట్లతో 30 ప్రాంతాల్లో పనులు
విస్తారమైన వర్షాల కారణంగా జీహెచ్‌ఎంసీ గ్రీవెన్స్ సెల్‌కు ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 946. వీటిలో శిథిలావస్థ భవనాలు, చెట్లు విరిగి పడిపోవడం, రోడ్లపై నీరు నిలిచిపోవడం, మ్యాన్‌హోల్స్ నుంచి నీరు పొంగడం తదితర సమస్యలు ఉన్నాయన్నారు. వీటిని తమ సిబ్బంది పరిష్కరిస్తూ వస్తున్నారన్నారు. నాలా పరీవాహక ప్రాంతాల వద్ద ఎస్‌ఎన్‌డీపీ కింద రూ.780 కోట్లతో 30 ప్రాంతాల్లో పనులు జరిగాయన్నారు. ఇంకా ఆరు చోట్ల మాత్రమే పనులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.
429 రెస్క్యూ టీంలు
వర్షాల కారణంగా ప్రజల అవసరాలు తీర్చేందుకు, ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు చేర్చేందుకు 429 రెస్క్యూ టీమ్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. ధ్వంసమైన రోడ్లను బాగు చేసేందుకు సీఆర్‌ఎంపీకి చెందిన 29 టీంలు పని చేస్తున్నాయని మేయర్ తెలిపారు. లోతట్టు ప్రాంతమైన గాజులరామారాం వద్ద నిలిచిపోయిన నీరును తొలగించేందుకు తమ సిబ్బంది పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.
► విద్యాసంస్థలకు, ప్రైవేటు సెక్టార్లకు, ఇతరత్రా కార్యాలయాలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చిన నేపథ్యంలో.. కొందరు బయటకు వచ్చేందుకు ఇష్టపడతారని.. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని.. ఇళ్లల్లోనే సేఫ్‌గా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మి సూచించారు.
వారం తర్వాత వారిపై సీరియస్ యాక్షన్
నగరంలో ఇప్పటి వరకు 483 శిథిలావస్థ భవనాలను గుర్తించామన్నారు. కూల్చేందుకు వెళ్లిన క్రమంలో మరమ్మతులు చేసుకుంటామని వాటి యజమానులు కోరడంతో కొంత గడువు ఇచ్చినట్లు చెప్పారు. వీరందరికీ నోటీసులు ఇచ్చామని, ఇప్పటికే 87 భవనాలను కూల్చివేశామని మేయర్ తెలిపారు. 92మంది రిపేర్ చేసుకోగా, 135 మంది ఖాళీ చేశారని, 19 భవనాలను సీజ్ చేశామని, 150 ప్రాసెస్‌లో ఉన్నాయన్నారు. వీటికి సంబంధించిన యజమానులు వారంలో రిపేర్ చేసుకోకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment