వినాశకాలే విపరీత బుద్ధి
చేరేవారు.. చేర్చుకొనేవారికి గుణపాఠం తప్పదు: జానా, షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: వినాశకాలే విపరీత బుద్ధి అని, రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపులు వారి వినాశకానికి నాంది అవుతాయని శాసనసభ, శాసనమండలిలో ప్రతిపక్షనాయకులు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ హెచ్చరించారు. హైదరాబాద్‌లో మంగళవారం విలేకరులతో వారు మాట్లాడుతూ... కొత్త రాష్ట్రంలో రాజకీయాలు, అనైతిక ఫిరాయింపులు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. కొత్త రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ప్రభుత్వం పనిచేయడం లేదన్నారు.
‘ప్రజాస్వామిక, నైతిక విలువలు పడిపోయాయి. పార్టీ ఫిరాయింపు లు బాధాకరం. స్వప్రయోజనాలు, వ్యాపార అవసరాల కోసం పార్టీ మారుతూ రాజకీయ జీవితాన్నిచ్చిన కాంగ్రెస్‌పై తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ పార్టీ మారాలనుకుంటే కాంగ్రెస్ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేయాలి. ఇది వారి నైతికత, రాజకీయ విలువలకు సంబంధించిన అంశం. ప్రభుత్వానికి అభివృద్ధిలో సహకరిస్తున్నాం. అయినా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే కుట్రలు చేయడం సీఎం కేసీఆర్‌కు తగదు.
ఈ అనైతిక, అప్రజాస్వామిక రాజకీయాలపై ప్రధాని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి వివరిస్తాం’ అని జానారెడ్డి అన్నారు. ఫిరాయింపులపై ఉత్తరాఖండ్ న్యాయస్థానం జోక్యంతో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని, వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్, శాసనమండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేస్తామని జానారెడ్డి, షబ్బీర్ అలీ చెప్పారు. ఇలాంటి తీరుపై తుపానులాగా ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
కేసీఆర్‌కు రాజకీయాలే ముఖ్యం...
కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కరువు పరిస్థితుల నుంచి ప్రజలను ఆదుకోవాలని జానా, షబ్బీర్ అలీ అన్నారు. కరువు, ఎండలతో ప్రజలు ఓ పక్క చనిపోతున్నా, వలసలు పోతున్నా... రాజకీయాలు తప్ప వారిని కాపాడుకోవాలనే యోచన సీఎంగా కేసీఆర్‌కు లేకపోవడం బాధాకరమన్నారు. పార్టీలో చేరికలు, ఫిరాయింపులు, ప్లీనరీలంటూ రాజకీయాలు తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. పదవులకు రాజీనామాలు చేయించకుండా ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులను బెదిరించి, ప్రలోభపెట్టి తమ పార్టీలో చేర్చుకుంటూ రాజకీయ పునరేకీకరణ అనడం కేసీఆర్ స్థాయికి తగదన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, నైతిక విలువలతో వ్యవహరించాలని సూచించారు.