తిరుమలగిరిలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో చోరీకి యత్నించింది జార్ఖండ్ గ్యాంగ్‌గా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
- తిరుమలగిరి ముత్తూట్ ఫైనాన్స్‌లో చోరీ యత్నం కేసు....
- పోలీసుల వలకు చిక్కని దొంగలు
బొల్లారం, న్యూస్‌లైన్: తిరుమలగిరిలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో చోరీకి యత్నించింది జార్ఖండ్ గ్యాంగ్‌గా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆదివారం దొంగలు మళ్లీ రావచ్చనే అనుమానంతో రాత్రంతా.. ముత్తూట్ పరిసర బిల్డింగ్‌లు, ప్రాంతాల్లో తిరుమలగిరి, జహీరాబాద్ పోలీసులు మాటు వేశారు. అయితే, ఈ విషయం పసిగట్టి దొంగలు రాలేదని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఘటన స్థలంలో చోరీకి ఉపయోగించిన సామగ్రి పోలీసులకు దొరికింది. దొంగలు వాటిని ఎక్కడ కొన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. జహీరాబాద్‌లో కూడా దొంగలు చోరీకి ఇదే తరహ సామగ్రిని ఉపయోగించినట్టు గుర్తించారు. వీటిని ఒకేచోట కొని ఉంటారని, జార్ఖండ్ గ్యాంగ్‌ల్లో ఒక ముఠా జహీరాబాద్‌లో విరుచుకుపడగా మరో ముఠా హైదరాబాద్‌లో మకాం వేసి తిరుమలగిరి ప్రాంతాన్ని టార్గెట్ చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
పక్కా స్కెచ్‌తోనే...
ముత్తూట్‌లో చోరీకి దొంగలు పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసులు తేల్చారు. ఘటనా స్థలంలో దొరికిన చిన్న గ్యాస్ సిలిండర్, చిన్నఫ్లేమ్ మెషీన్, మూడు రకాల స్క్రూ డైవర్లు, 4 అడుగుల పొడవైన రెండు గునపాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. హైటెక్ పద్ధతిలో దొంగలుకు చోరీకి పథకం వేశారని నిర్ధారణకు వచ్చారు. వీటిని దాచేందుకు దుండగులు రెండు షోల్డర్ బ్యాగులన ఉపయోగించారు.
కార్యాలయంలో రెక్కీ....
దుండుగులు తిరుమలగిరి ముత్తూట్ కార్యాలయంలో మొత్తం తిరిగి రెక్కీ చేసుకున్నట్లు పోలీ సులు గుర్తించారు. దోపిడీకి వచ్చిన వెంటనే కార్యాలయంలో ఉన్న ఐదు సీసీ కెమెరాల కనెక్షన్లతో పాటు విద్యుత్ మెయిన్ వైర్‌లను కూడా కట్ చేశారు. దీనిబట్టి కార్యాలయ పనివేళ్లలో సుమారు పది రోజుల పాటు ఆఫీసు మొత్తం కలియదిరిగి ప్రతీ విషయాన్ని గమనించి దోపిడీకి ప్లాన్ చేసి ఉంటారని భావిస్తున్నారు. కాగా, ఈ ముఠాలో ఒకరిద్దరు నేపాలీలు కూడా ఉన్నట్లు పోలీసులకు కీలక సమాచారం లభించింది. వీటి ఆధారంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దుండగుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
గ్యాంగ్ లీడర్ కమ్రానుద్దీన్?
ఈ ముఠాలన్నింటికీ జార్ఖండ్‌కు చెందిన కమ్రానుద్దీన్ గ్యాంగ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారని విచారణలో వెలుగులోకి వచ్చింది. అతనిపై జార్ఖండ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఇదే తరహా కేసులు నమోదైనట్లు తెలిసింది. అతని ఆచూకీ కోసం జహీరాబాద్ పోలీసులతో పాటు తిరుమలగిరి పోలీసు లు జార్ఖండ్‌కు వెళ్లినట్టు తెలిసింది. కమ్రానుద్దీన్ ఎలక్ట్రికల్, వెల్డింగ్ వర్క్స్‌లో నిపుణులైన యువతను ఎంపిక చేసుకుని నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.