50 లక్షల మందికి ఉద్యోగాలు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: వేతన, ఉద్యోగ, సామాజిక భద్రతలు కల్పించేందుకు తమ ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. రానున్న కాలంలో 50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడేళ్లయిన సందర్భంగా ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ఓ తదితర సంస్థల ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన సదస్సులో దత్తాత్రేయ ప్రసంగించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ పాల్గొన్నారు. దత్తాత్రేయ మాట్లాడుతూ.. కార్మిక మంత్రిత్వ శాఖ గత మూడేళ్లలో కార్మికులకు అనుకూలంగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిందని నక్వీ ఈ సందర్భంగా కొనియాడారు.
మూడేళ్లలో ఈపీఎఫ్‌ఓ అమలు చేసిన కార్యక్రమాలపై చిత్రీకరించిన డాక్యుమెంటరీని ఈ సందర్భంగా ప్రదర్శించారు. సికింద్రాబాద్, ఈపీఎఫ్‌ఓకు చెందిన ఆల్టర్ నెట్ డేటా సెంటర్, మెహదీపట్నం, కూకట్‌పల్లి, పటాన్‌చెరుల్లో ఈపీఎఫ్‌ఓ ప్రాంతీయ కార్యాలయాలను ఆన్‌లైన్ ద్వారా మంత్రులు ప్రారంభించారు. అలాగే ఈపీఎఫ్‌ఓ కొత్త వెబ్‌సైట్‌ను కూడా ఆవిష్కరించారు. కాగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా పాల్గొన్నారు.