‘పూలే’ పోస్టర్ విడుదల చేసిన జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే 109వ జయంతి ఉత్సవాల పోస్టర్‌ను బీసీ సంక్షేమ మంత్రి జోగురామన్న, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ చక్రహరి రామరాజులతో కలసి సచివాలయంలో శనివారం విడుదల చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో పూలే జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రెండు పడక గదుల కేటాయింపులో బీసీలకు 50 శాతం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని చెప్పారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడే స్చేచ్ఛ, సమానత్వాలు లభించిన ట్లని ఆర్.కృష్ణయ్య అన్నారు.
వన్యప్రాణి సంరక్షణకు పటిష్టమైన చర్యలు
వన్యప్రాణి సంరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సచివాలయంలోని తన చాంబర్‌లో శనివారం ఆయన వన్యప్రాణి సంరక్షణపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరల్డ్ వైడ్ ఫండ్ సహకారంతో వన్యప్రాణి సంరక్షణ, ఇతర అంశాలను అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. నల్లమలలోని అమ్రాబాద్ అడవుల్లోని వాతావరణంపై అధ్యయనం చేసి కొత్తగా అడవిదున్నలు, గేదె, మూషిక జింకలను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అలాగే టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో సోలార్ లైటింగ్ ఏర్పాటు చేయిస్తామన్నారు.
ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు స్థానిక గిరిజనులకు హైదరాబాద్ శివార్లలోని దూలపల్లి అటవీశాఖ అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. గిరిజనులకు ఉపాధి కల్పించే కార్యాచరణను రూపొందించాలని మంత్రి రామన్న అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ మాజీ స్పీకర్, పర్యావరణ వేత్త కె. సురేశ్‌రెడ్డి, అటవీశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, అదనపు పీసీసీఎఫ్‌లు ఏకే శ్రీవాస్తవ, పృథ్వీరాజ్, వరల్డ్ వైడ్ ఫండ్ ప్రతినిధులు అనిల్‌కుమార్, ఫరీదా టంపాల్ తదితరులు పాల్గొన్నారు.