
ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే..
విద్యా వ్యవస్థపై ప్రభుత్వాలకు శ్రద్ధ ఉండటంలేదు: కడియం
ప్రైవేట్ పాఠశాలల ఫీజులు నియంత్రిస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మారిన ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నాయని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలకు రోడ్లు, చెరువుల మీద ఉన్న శ్రద్ధ విద్య పట్ల ఉండటంలేదని మంగళవారం శాసనమండలిలో విద్యా వ్యవస్థపై జరిగిన స్వల్పకాలిక చర్చలో అన్నారు. అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాత పద్ధతులకు స్వస్తి పలికి విద్యా విధానంపై త్వరలో కొత్త పాలసీ తీసుకు రానున్నట్లు తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లలో ఇష్టానుసారంగా వసూళ్లు చేస్తున్న ఫీజులను నియంత్రిస్తామన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచే చట్టానికి లోబడి ఉండేలా రెగ్యులేటరీ ఏర్పాటు చేసి పేద, మధ్య తరగతి వర్గాల వారికి ఊరట కల్పిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను గాడిన పెట్టేందుకు మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ, అకడమిక్ విలువల పెంపునకు ప్రయత్నిస్తామన్నారు.రాష్ట్రంలోని 130 డిగ్రీ కాలేజీల ల్లోనూ మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి యూజీసీ ద్వారా నిధులు వచ్చేలా చేస్తామన్నారు. అన్ని యూనివర్శిటీలకు నెల రోజు ల్లోగా వీసీలను నియమిస్తామన్నారు. తెలంగాణలో 15 నుంచి 55 ఏళ్ల మధ్య వారిలోనే నిరక్షరాస్యులున్నారని, 15 ఏళ్ల లోపున్న బడి ఈడు పిల్లల్లో 97 శాతం అక్షరాస్యత ఉందన్నారు. టెట్ పాసయ్యాక డీఎస్సీ నిర్వహించాల్సిన అవసరం లేదని, అర్హులైన వారు ఎక్కువగా ఉండటంవల్ల ఫిల్టర్ చేయడం కోసమే ఈ పద్ధతి అవలంబిస్తున్నట్టు తెలిపారు.
ఎన్ని రకాలుగా దోచుకుంటారు: పాతూరి
అంతకు ముందు చర్చలో భాగంగా ఎమ్మెల్సీ పాతూరి సూధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. టెట్, డీఎస్సీ నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు కొలువు కోసం బీఈడీ, టెట్, డీఎస్సీ... ఇలా ఎన్ని పేర్లతో జేబులు గుల్ల చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు పెట్టుకునే స్వాతంత్య్రం అందరికీ ఉం టుందని, దాన్ని కాదనే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ఈ చర్చలో 15 మంది సభ్యులు... షబ్బీర్‌ఆలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆకుల లలిత, కె.దామోదర్‌రెడ్డి, అల్తాఫ్ హైదర్ రజ్వి, కె.జనార్ధన్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావు, సతీష్‌కుమార్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పూల రవీందర్, శ్రీనివాస్‌రెడ్డి, భూపతిరెడ్డి, భూపాల్‌రెడ్డిలు పాల్గొని ప్రభుత్వానికి సల హాలు, సూచనలు ఇచ్చారు.