త్వరలో ‘కాకతీయ ఫుడ్స్’ | Kakatiya Foods as soon | Sakshi
Sakshi News home page

త్వరలో ‘కాకతీయ ఫుడ్స్’

Published Tue, Jun 7 2016 3:19 AM | Last Updated on Fri, Oct 5 2018 6:36 PM

త్వరలో ‘కాకతీయ ఫుడ్స్’ - Sakshi

త్వరలో ‘కాకతీయ ఫుడ్స్’

- తెలంగాణ సర్కారు ఆధ్వర్యంలో ఆహార ఉత్పత్తుల విక్రయాలు
- ఉద్యానాభివృద్ధి సంస్థ విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
 
 సాక్షి, హైదరాబాద్: కల్తీలేని ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ సర్కారు సమాయత్తమవుతోంది. ‘కాకతీయ ఫుడ్స్’ బ్రాండ్‌తో పండ్లు, కూరగాయలు, కారం, పసుపు, సుగంధ ద్రవ్యాలను విక్రయించాలని నిర్ణయించింది. దేశ విదేశాలకు సేంద్రియ పండ్లు, కూరగాయలు ఎగుమతి చేయాలనీ యోచిస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థ’ విధివిధానాలను ఖరారు చేస్తూ వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ ఉద్యానాభివృద్ధి సంస్థ పేరుతో కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు చేయాలని ఆదేశాలిచ్చారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆహార ఉత్పత్తులు పండిస్తే... రైతులకు లాభసాటిగా మార్చేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ఆ ఉత్పత్తులకు అవసరమైన ప్రాసెసింగ్, మార్కెటింగ్ బాధ్యత ఉద్యానాభివృద్ధి సంస్థ చేపడుతుంది. రాష్ట్రంలో ఆహార పదార్థాల్లో పెద్ద ఎత్తున కల్తీ జరుగుతుండటంతో దీన్ని అరికట్టేందుకు సీఎం కేసీఆర్ ఉద్యానాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

 ఉద్యానాభివృద్ధి సంస్థ విధివిధానాలివి...  
►ఉద్యాన పంటల సాగులో వ్యవసాయ యాంత్రీకరణను విరివిగా ప్రోత్సహించాలి. పంట చేతికి వచ్చాక ఎగుమతులు, స్థానిక అవసరాల కోసం ఆహార ఉత్పత్తులను గ్రేడింగ్, ప్రాసెసింగ్ చేయాలి.
►రుణాలతో సంబంధమున్న సూక్ష్మ సేద్యం, పాలీ హౌస్, కోల్డ్ స్టోరేజ్, రైపనింగ్ చాంబర్స్, ప్యాక్ హౌసెస్, ఔట్‌లెట్ల వ్యవహారాన్ని సంస్థ పర్యవేక్షిస్తుంది.
►ఉద్యానశాఖ పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, ఉల్లి ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాలి. ప్రాసెస్ చేసి మార్కెటింగ్ చేయాల్సిన బాధ్యతనూ తీసుకోవాలి.
►ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రైవేటు పరిశ్రమలు, ఫుడ్ పార్కుల సహకారం తీసుకునే అవకాశాల్ని అన్వేషించాలి.
►పండ్లు, కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాలు పండించే రైతులకు పూర్తిస్థాయిలో లాభాలు వచ్చేలా సంస్థ చొరవ చూపాలి.

 చైర్మన్‌గా పార్థసారథి...
 ఉద్యానాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి, ఎండీ, వైస్‌చైర్మన్‌గా ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ఉంటారు. బోర్డు డెరైక్టర్లుగా ఫుడ్ ప్రాసెసింగ్, ఇండస్ట్రీస్ ముఖ్య కార్యదర్శి, ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీ, అగ్రికల్చర్, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (అపెడా) డిప్యూటీ జనరల్ మేనేజర్, వ్యవసాయశాఖ డెరైక్టర్, మార్కెటింగ్ కమిషనర్, ఉద్యాన, వ్యవసాయ వర్సిటీల వైస్ చాన్స్‌లర్లు, ఆగ్రోస్ ఎండీ, టీఎస్‌ఐఐసీ ఎండీ, ఫుడ్ సేఫ్టీ అథారిటీ కమిషనర్‌లుగా ఉంటారని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement