హైదరాబాద్ : భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ప్రముఖ కాపు నేతలు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు నివాసంలో సమావేశం కానున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు కాపు నేతలతో తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు కన్నబాబు భేటీ అయ్యారు.
కాపులను వేధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడకు ఏం జరిగినా అందుకు చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని కన్నబాబు డిమాండ్ చేశారు. ఇక ముద్రగడ దీక్షపై కడపలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాపు, బలిజ, అఖిలపక్ష నేతలు హాజరయ్యారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, రఘురాంరెడ్డి, మేయర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
కాగా ముద్రగడ దీక్షను వెనకుండి నడిపిస్తున్నారంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ముద్రగడకిచ్చిన హామీలు అధికారులు చెప్పినవే అని, లోకేశ్ చెప్పినవి కాదని అన్నారు. కాపులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోందని గంటా తెలిపారు.