కొత్త జిల్లాలు | KCR at new districts work shop | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాలు

Published Thu, Jun 30 2016 3:19 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

కొత్త జిల్లాలు - Sakshi

కొత్త జిల్లాలు

టీఆర్‌ఎస్ వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్
 దేశ సగటుకన్నా రాష్ట్రంలోని జిల్లాల సగటు విస్తీర్ణం, జనాభా అధికం
 అందుకే జిల్లాల పునర్విభజన
 కొత్తగా 14 జిల్లాలు, 73 లేదా 74 కొత్త మండలాల ఏర్పాటు
 రాజకీయ డిమాండ్లు అర్థం లేనివి
 ప్రజల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటాం
 త్వరలో అఖిలపక్షం ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరిస్తాం
 వర్క్‌షాప్‌నకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షుల హాజరు
 అధికారుల ప్రతిపాదనలను దాదాపు ఆమోదించిన అధికార పార్టీ

 
 సాక్షి, హైదరాబాద్: పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యం అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై హెచ్‌ఐసీసీలో బుధవారం జరిగిన టీఆర్‌ఎస్ వర్క్‌షాప్‌లో కేసీఆర్ ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘దేశంలో 125 కోట్ల జనాభా ఉంటే 683 జిల్లాలు ఉన్నాయి. అంటే ఒక్కో జిల్లా సగటు జనాభా 18.3 లక్షలు. దేశ విస్తీర్ణం 30 లక్షల చదరపు కిలోమీటర్లు.
 
 జిల్లాల సగటు విస్తీర్ణం 4,392 చదరపు కిలోమీటర్లు. తెలంగాణ జనాభా 3.60 కోట్లు. పది జిల్లాల  సగటు జనాభా 36 లక్షలు. తెలంగాణ విస్తీర్ణం 1.14 లక్షల చదరపు కిలోమీటర్లు. జిల్లాల సగటు విస్తీర్ణం 11 వేల కిలోమీటర్లు. దేశంలో జిల్లాల సగటు జనాభా 18 లక్షలైతే తెలంగాణలో జిల్లాల సగటు జనాభా 36 లక్షలు. ఈ కారణంగానే జిల్లాల పునర్విభజన చే పట్టాం’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజన ఎప్పటికప్పుడు జరిగినా పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లలోనే జరగలేదని, దానివల్ల జిల్లా యూనిట్‌గా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేద న్నారు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాల వంటివి కొత్తవి రావాలని, అందుకే కొత్త జిల్లాలు కావాలని సీఎం వివరించారు.
 
 14 జిల్లాలు, 74 మండలాల ఏర్పాటుకు అవకాశం
 ‘‘కొత్త రాష్ట్రం అనుకున్న రీతిలో అభివృద్ధి సాధించాలి. కొత్త అభివృద్ధి కేంద్రాలు రావాలి. ఇప్పటిదాకా ఉన్న ప్రతిపాదనల ప్రకారం 14 జిల్లాలు, 73 నుంచి 74 మండలాలు కొత్తగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అంతిమంగా ప్రజల అభీష్టం మేరకు జిల్లాల పునర్విభజన జరగాలి. ఒక్కో జిల్లాకు సగటున 20 మండలాలు ఉంటాయి. జిల్లా కేంద్రానికి దగ్గరున్న మండలాలను అదే జిల్లాలో చేర్చాల్సి ఉంది. ఎక్కువ జనాభా ఉన్న నగరాలు, పట్టణాలను అర్బన్ మండలాలుగా చేర్చే ప్రతిపాదన ఉంది. ఒక నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండాలనే నిబంధన ఏమీ లేదు. ఒక అసెంబ్లీ నియోజకవర్గం 2, 3 జిల్లాల్లో విస్తరించొచ్చు.
 
 జిల్లా కేంద్రానికి దగ్గరున్న మండలాలను అదే జిల్లాలో ఉంచడంతోపాటు మండల కేంద్రానికి దగ్గరున్న గ్రామాలను అదే మండలంలో చేర్చాలి’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘దసరా నాడు కొత్త జిల్లాలు ఏర్పాటు కావాలి. పని ప్రారంభం కావాలి. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై మీకు (ప్రజాప్రతినిధులు, నాయకులు) పూర్తి అవగాహన ఉండాలి. మీరు కూడా అధ్యయనం చేసి సూచనలివ్వండి. ప్రస్తుతం అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలో అఖిలపక్షం ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకుంటాం..’’ అని సీఎం చెప్పారు.
 
 చిన్న జిల్లాలతో పరిపాలన బాగుంటుంది
 చిన్న జిల్లాలుంటే పరిపాలన బాగుంటుందని, ఒక్కో కుటుంబం పరిస్థితి తెలుస్తుందని, పేద కుటుంబాలను గుర్తించి పైకి తేవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. జిల్లా కేంద్రాలంటే కేవలం జిల్లా కేంద్రమే కాదని, అవి అభివృద్ధి కేంద్రాలుగా మారాలని అభిలషించారు. ఆ దిశలోనే ప్రణాళికలు, ఆలోచనలు ఉండాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ అభివృద్ధి రేటు బాగుందని, ఆ ఫలితాలు పేదలకు అందాలన్నారు. ‘‘కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చే విమర్శలను పట్టించుకోవద్దు. రాజకీయ కారణాలతో వచ్చే డిమాండ్లు అర్థం లేనివి. ప్రజల డిమాండ్లు, ప్రజల సౌకర్యాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి’’ అని సీఎం వ్యాఖ్యానించారు.
 
 బృందాలవారీగా నేతల చర్చలు
 టీఆర్‌ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీల అధ్యక్షులు, నాయకులు బృందాలుగా ఏర్పడి కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై చర్చించారు. ముఖ్యంగా ఏ జిల్లాకు ఆ జిల్లాగా గ్రూపులుగా చర్చించి కొన్ని సూచనలు, సలహాలు, సిఫారసులను సమావేశ సమన్వయకర్త ఎంపీ కె. కేశవరావుకు అందించారు. అధికారుల ప్రతిపాదనలను దాదాపు అన్ని జిల్లాల నాయకులు ఆమోదించారు. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు జిల్లా సమీక్షల్లో వెల్లడైన అభిప్రాయాలను నివేదిక రూపంలో అందించారు. వరంగల్ నివేదికను ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు తక్కెళ్లపెల్లి రవీందర్‌రావు అందజేశారు.
 
 వరంగల్ జిల్లాలో ఏర్పాటయ్యే జిల్లాకు ప్రొఫెసర్ జయశంకర్ (భూపాలపల్లి) పేరును, ఆదిలాబాద్ జిల్లాలో కొమురం భీమ్ (మంచిర్యాల) పేరును పెట్టాలని టీఆర్‌ఎస్ ప్రతినిధులు కోరారు. మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే తయారైన ప్రతిపాదనలను ఆ జిల్లాల నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. మిగతా జిల్లాల్లో 90 శాతం ఏకాభిప్రాయం కుదిరింది. చిన్నచిన్న మార్పులను నాయకులు సూచించారు. వారి అభిప్రాయాలు, నివేదికలను సీఎంకు అందిస్తామని, సీఎం తుది నిర్ణయం తీసుకుంటారని కేకే వెల్లడించారు. ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో టీఆర్‌ఎస్ తరపున అభిప్రాయం చెప్పడానికి పార్టీ అధిష్టానం నివేదిక రూపొందిస్తుందన్నారు. కేకేతోపాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
 

ఆషామాషీగా తీసుకోవద్దు: కేసీఆర్
 ‘‘కొత్త జిల్లాల ఏర్పాటును ఆషామాషీగా తీసుకోవద్దు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వారికి ఏది అవసరమో అదే చేద్దాం. జిల్లాల ఏర్పాటు మీ రాజకీయ జీవితానికి ఆధారం. మీ రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టకండి. అందరితో మాట్లాడండి. భేషజాలకు పోవద్దు. ప్రాంతాలు, సెంటిమెంట్లు, ప్రజల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తగా సూచనలు చేయండి’’ అని సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ నేతలకు హితబోధ చేశారు. ప్రస్తుతం చేస్తున్నవి రెవెన్యూ జిల్లాలు మాత్రమేనని, పంచాయతీరాజ్ జిల్లాలు కావని, ఈసారికి జెడ్పీ చైర్మన్ల మార్పేమీ ఉండదని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది.
 
 సంక్లిష్టంగా వరంగల్ జిల్లా పునర్విభజన?
 వరంగల్ జిల్లాను 3 జిల్లాలుగా పునర్విభజించే అంశం సంక్లిష్టంగా మారిందని తెలిసింది. జనగామను ప్రత్యేక జిల్లాగా చేయాలని ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, ఎర్రబెల్లి, టి.రాజయ్యలు కేకేకు లేఖ అందజేశారు. అంతకు ముందే జనగామను జిల్లా చేయలేమని, ఆలేరు, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాల ప్రజలు సుముఖంగా లేరని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. జనగామ నియోజకవర్గంలోని మద్దూరు, నర్మెట్ట మండలాల నేతలు సిద్దిపేటలో ఉంటామని చెబుతున్నారని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
 
 నేతల భేటీలో చర్చకొచ్చిన అంశాలు...
 టీఆర్‌ఎస్ వర్క్‌షాప్‌లో నేతల మధ్య జరిగిన చర్చ గురించి పార్టీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం...
 కొత్తగా ఏర్పాటయ్యే మహబూబాబాద్‌లో కలవబోమని ఖమ్మం జిల్లా గార్ల మండల నేతలు తేల్చి చెప్పారు.
 ఆచార్య జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా చేసినా, జిల్లా కేంద్రంగా ములుగును ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చింది.
 కరీంనగర్ జిల్లా పునర్విభజనలో సిరిసిల్లను కొత్త జిల్లాగా చేయనవసరం లేదని మెజారిటీ అభిప్రాయం వ్యక్తమైంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఒక్కరే సిరిసిల్ల జిల్లా కావాలని అడిగారు.
 కరీంనగర్‌లో మూడు జిల్లాలు చేయాల్సి వస్తే పారిశ్రామిక ప్రాంతమైన రామగుండాన్ని కొత్త జిల్లా చేయాలని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ సూచించారు.
 సంగారెడ్డి జిల్లాకు ‘మంజీర’ పేరును ఖరారు చేయాలని ఆ జిల్లా నేతలు ప్రతిపాదించారు.
 నిజామాబాద్ జిల్లా నేతలు తమకు కొత్తగా పది మండలాలు ఏర్పాటు చేయాలని కోరారు.
 సూర్యాపేట కొత్త జిల్లాలోనే మిర్యాల గూడ నియోజకవర్గాన్ని కలిపితే బాగుం టుందన్న అభిప్రాయాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యక్తపరచగా ఆ ప్రాంత నేతలు మాత్రం తాము నల్లగొండ జిల్లాలోనే కొనసాగుతామని పేర్కొన్నారు.
 ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గం దాదాపు 80 శాతం వరంగల్ జిల్లాలో కలుస్తున్న తీరుపైనా నేతల మధ్య చర్చ జరిగింది.
 మహబూబ్‌నగర్‌లో వీలుంటే గద్వాలను కొత్త జిల్లా చేయాలని, కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు.
 కొన్ని జిల్లాల నేతలు రెవెన్యూ డివిజన్లలో జరుగుతున్న మార్పులపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
 
 ప్రతిపాదిత కొత్త జిల్లాలు, కొత్త మండలాల జాబితా ఇదీ..
 జిల్లా            నియోజకవర్గం        ప్రతిపాదిత మండలం
 
 హైదరాబాద్        మహేశ్వరం            ఎల్‌బీ నగర్
                       రాజేంద్రనగర్        గండిపేట
 సికింద్రాబాద్        మేడ్చల్            చెర్లపల్లి
                         ,,                 జవహర్‌నగర్
                      కుత్బుల్లాపూర్        దుండిగల్
 రంగారెడ్డి            తాండూరు            కోటిపెల్లి
 మెదక్                మెదక్             హవేలీ ఘన్‌పూర్
 సంగారెడ్డి            నారాయణఖేడ్        సిర్గాపూర్
                            ,,                నాగులగిద్దె
                       పటాన్‌చెరు            గుమ్మడిదల
                            ,,                 అమీన్‌పుర
                         సంగారెడ్డి            కంది
                        జహీరాబాద్        ముగ్దుంపల్లి
 సిద్దిపేట            హుస్నాబాద్        కట్కూర్
                       జనగాం            కొమురవెల్లి
                       సిద్దిపేట            నారాయణరావుపేట
 మహబూబ్‌నగర్        జడ్చర్ల            రాజపూర్
                      మహబూబ్‌నగర్        మహబూబ్‌నగర్ రూరల్
                      నారాయణపేట          మరికల్
 నాగర్‌కర్నూల్        అచ్చంపేట            పదర
 వనపర్తి                   గద్వాల            నందిన్నె
 నల్లగొండ              దేవరకొండ            నేరెడిగొమ్ము
                                ,,              కొండమల్లేపల్లి
                      మునుగోడు           గట్టుప్పల్
                     నాగార్జునసాగర్        తిరుమలగిరి
                       నల్లగొండ            మూడ్గులపల్లి
 సూర్యాపేట        కోదాడ                కోదాడ అర్బన్
                    సూర్యాపేట            సూర్యాపేట అర్బన్
                       తుంగతుర్తి            నాగారం
 యాదాద్రి            ఆలేరు            మోటకొండూరు
                      భువనగిరి            భువనగిరి అర్బన్
                     తుంగతుర్తి            అడ్డగూడూరు
 నిజామాబాద్        ఆర్మూర్            ఆలూర్
                         బాల్కొండ            రెంజర్ల
                        బోధన్            బోధన్ రూరల్
                    నిజామాబాద్ రూరల్            నిజామాబాద్ నార్త్
                                 ,,            నిజామాబాద్ రూరల్
                                ,,            ఇందల్వాయి
                                   ,,            మోపాల్
 కామారెడ్డి             బాన్సువాడ        రుద్రూరు
                        కామారెడ్డి            కామారెడ్డి రూరల్
                          ఎల్లారెడ్డి            రామారెడ్డి
 కరీంనగర్            కరీంనగర్            కరీంనగర్ రూరల్
                        పెద్దపల్లి            పెద్దపల్లి రూరల్
                        రామగుండం        రామగుండం రూరల్
 జగిత్యాల            ధర్మపురి            బుగ్గారం
                      జగిత్యాల            జగిత్యాల రూరల్
                         కోరుట్ల            కోరుట్ల రూరల్
                              ,,            మెట్‌పల్లి రూరల్
 సిరిసిల            మానకొండూరు        పొత్తూరు
                         సిరిసిల్ల            సిరిసిల్ల రూరల్
                              ,,               వీర్నపల్లి
                      వేములవాడ        వేములవాడ రూరల్
                               ,,            రుద్రంగి
 వరంగల్            స్టేషన్ ఘన్‌పూర్        చిల్పూరు
                          హుస్నాబాద్        వేలేరు
                          హుజురాబాద్        ఇల్లంతకుంట
                             వర్ధన్నపేట             ఖాజీపేట
                                 ,,                    ఐనవోలు
                           వరంగల్                 ఖిలా వరంగల్
 ఆచార్య జయశంకర్        భూపాలపల్లి        టేకుమట్ల
                                 మంథని              పలిమెల
 మహబూబాబాద్        మహబూబాబాద్        చిన్నగూడూర్
 ఖమ్మం                       పాలేరు            రఘునాథపాలెం
 కొత్తగూడెం                  కొత్తగూడెం            చెంచుపల్లి
                                     ,,              పాల్వంచ రూరల్
                                పినపాక            ఆళ్లపల్లి
                                   ,,               కరకగూడెం
 ఆదిలాబాద్        ఆదిలాబాద్             మావల
                             నిర్మల్               సోన్
 కొమురం భీం        ఆసిఫాబాద్            చిర్రకుంట
                            మంచిర్యాల          హాజీపూర్
                                     ,,             నస్పూర్
                               సిర్పూర్          పెంచికలపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement