సర్పంచ్‌ గెలవలేవు.. | kcr fires on jairam ramesh | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ గెలవలేవు..

Published Sat, Mar 1 2014 1:22 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM

సర్పంచ్‌ గెలవలేవు.. - Sakshi

సర్పంచ్‌ గెలవలేవు..

మా పార్టీపై విమర్శలా? - జైరాంరమేశ్‌పై కేసీఆర్ ఫైర్
 ప్రజల ఎమోషన్స్, డిమోషన్స్ గురించి జైరాంరమేశ్‌కు ఏమీ తెలీదు
 తెలంగాణకు వ్యతిరేకమని ఇక్కడికి వచ్చి చెప్పటం అవమానించటమే
 కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనంపై నేను ఒక్కడినే నిర్ణయం తీసుకోలేను
 3న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,పొలిట్‌బ్యూరోతో భేటీలో చర్చిస్తాం

 
 సాక్షి, హైదరాబాద్: గ్రామ సర్పంచ్‌గా అయినా పోటీచేసి గెలవకుండా కేంద్రమంత్రి అయిన జైరాంరమేశ్ తమ పార్టీ గురించి మాట్లాడటం సరికాదని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఎద్దేవా చేశారు. ప్రజల ఎమోషన్స్, డిమోషన్స్ ఏమీ జైరాంరమేశ్‌కు తెలియవని.. తెలంగాణ ఏర్పాటుకు వ్యక్తిగతంగా వ్యతిరేకమని ఇదే గడ్డ మీదకు వచ్చి చెప్పడం ప్రజలను అవమానించడమేనని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు పి.మహేందర్‌రెడ్డి (తాండూరు), కె.ఎస్.రత్నం (చేవెళ్ల), ఎమ్మెల్సీ పి.నరేందర్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర నేతలు పలువురు శుక్రవారం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు విషయంలో చాలామటుకు విజయం సాధించినా తాము ఆశించినట్టుగా రాష్ట్రం రాలేదని పేర్కొన్నారు.
 
  భద్రాచలం డివిజన్‌లోని ఆదివాసీలను పోలవరం ప్రాజెక్టు ముంపులో ముంచడానికి తాము వ్యతిరేకమని, పోలవరం డిజైన్ మార్చాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. భద్రాచలం డివిజన్‌లోని 7 మండలాలను సీమాంధ్రలో కలిపే విధంగా ఆర్డినెన్స్ తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఇలాంటి ఎన్నో ఇబ్బందులున్నాయని పేర్కొన్నారు.
 
 ప్రజలంతా అదే కోరుకుంటున్నారు: ఎన్ని ఇబ్బందులున్నా కాంగ్రెస్ వారు మంచిగా ఉంటే కలసి పోదామనుకున్నామని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనంపై మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. విలీనంపై తాను ఒక్కడినే నిర్ణయం తీసుకోలేనని.. మార్చి మూడో తేదీన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పొలిట్‌బ్యూరో సభ్యులతో సమావేశమై, అన్ని విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ‘విలీనంపై మీరేమంటారు?’ అని ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి కేసీఆర్ ప్రశ్నించారు. ‘విలీనం చేయొద్దు.. ఒంటరిగానే పోటీచేద్దాం’ అని సభికులంతా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కేసీఆర్ స్పందిస్తూ.. ‘‘మీతో పాటు తెలంగాణ ప్రజలంతా అదే కోరుకుంటున్నరు. తెలంగాణ పునర్నిర్మాణం కూడా టీఆర్‌ఎస్ మాత్రమే చేస్తుందని అంటున్నరు. ఏది మంచిగా ఉంటదో ఆలోచించి, నిర్ణయం తీసుకుందాం’’ అని పేర్కొన్నారు.
 
 ఆరేడేళ్లలో అభివృద్ధి చేసి అప్పగిస్తా: తెలంగాణ సాధనతోనే పోరాటం పూర్తయిపోయినట్టు కాదని, కోరుకున్నట్టుగా తెలంగాణను బంగారు తునకగా చేసుకుని దేశానికే తలమానికంగా రూపొందించుకుంటామని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘నాకో గొప్ప కల ఉంది. కులాలకు అతీతంగా ప్రభుత్వమే రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటుచేయాలి. మంత్రుల, ఐఏఎస్ పిల్లలు చదివే స్కూళ్లకన్నా అద్భుతంగా అవి ఉంటాయి. అందరికీ ఉచిత నిర్బంధ విద్యను అమలుచేస్తాం. ఒక తరం చదువుకుంటే ఆ తరువాత వచ్చే తరాలన్నీ అభివృద్ధి అవుతయి’’ అని ఆయన చెప్పారు. రాష్ట్ర సాధనతోనే బాధ్యత అయిపోలేదని, పునర్నిర్మాణంలోనూ బాధ్యత తీసుకోవాలని యువకులు, నిరుద్యోగులు, రైతులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఎన్నో తిట్లు, అవమానాలు, బాధలను తట్టుకున్నానని.. ఎన్ని ఇబ్బందులొచ్చినా లక్ష్యం నుండి పక్కకు జరగలేదని కేసీఆర్ చెప్పారు. పునర్నిర్మాణంలోనూ అంతే మొండిగా, గట్టిగా ఉంటామన్నారు.
 
 టీడీపీని ఖాళీచేసి తెలంగాణ పార్టీల్లో చేరాలి...
 తెలంగాణను చివరిదాకా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ, పార్లమెంట్ సెంట్రల్ హాలులో విషపునవ్వుతో ఉన్న చంద్రబాబునాయుడు కింద తెలంగాణ నేతలు ఎలా పనిచేస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. ఆంధ్రా నేతల పెత్తనంలో ఉన్న పార్టీలు తెలంగాణకు ఎందుకన్నారు. అందుకే టీడీపీని ఖాళీ చేసి తెలంగాణ పార్టీల్లో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు పి.మహేందర్‌రెడ్డి, కె.ఎస్.రత్నం మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో చేరితే సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉందన్నారు. త్వరలోనే భారీ బహిరంగసభ ద్వారా సత్తా చాటుతామన్నారు.
   
 టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సమావేశం వాయిదాటీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సమావేశం 3వ తేదీకి వాయిదా పడింది. మొదట ఈ భేటీ ఒకటో తేదీన (శనివారం) జరపాలని  నిర్ణయించారు.
 
 జైరాం రమేశ్ వ్యాఖ్యలు సరికాదు: పొన్నాల
 కాగా టీఆర్‌ఎస్ సంకుచిత పార్టీ అని.. తెలంగాణలో దొరల పాలన వస్తుందని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించటం సరికాదని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో నేతల మాటలు, వ్యవహారం హుందాగా ఉండాలని, కానీ జైరాం వ్యాఖ్యలు అలా లేవని శుక్రవారం ఆయన విలేకరులతో అన్నారు.
 
 ఈ సభలో కేసీఆర్ పలు
 హామీలు గుప్పించారు.. అవేమిటంటే..
     {పతీ దళితుడికి సాగుకు యోగ్యమైన మూడెకరాల భూమి. అది కూడా ఒకే దగ్గర ఇస్తా.
 
     ఏటా రూ. 10 వేల కోట్లతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు. ఐదేళ్లలో రూ. 50 వేల కోట్లు దళితుల సంక్షేమం, అభివృద్ధికోసమే.
 
     ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తా.
 
     లంబాడీ తాండాలు, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలుగా మారుస్తాం.
 
     {పతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం.
 
     తెలంగాణలో 24 జిల్లాలను చేస్తా.
 
     వికలాంగులకు రూ.1,500 ఫించను అందిస్తా.
 
     వితంతువులు, వృద్ధులకు వెయ్యి పింఛను ఇస్తాం.
 
     కులాలకతీతంగా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఉచిత నిర్బంధ విద్యను అందిస్తాం.
 
     {పతీ పేద కుటుంబానికి 2 బెడ్‌రూములు, హాలు, కిచెన్, బాత్‌రూములు, టాయిలెట్లతో కూడిన ఇళ్లు కట్టిస్తా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement