‘మల్టీ’ టాస్క్
నగరంలో ట్రాఫిక్ సమస్యలపై సీఎం దృష్టి
మల్టీలెవల్ ఫ్లైఓవర్లు, స్కైవేల పనులు వేగవంతం
నివేదిక అందించాలని అధికారులకు ఆదేశం
సిటీబ్యూరో: నగరంలో ప్రయాణానికి ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ట్రాఫిక్ ర ద్దీతో నిత్య నరకం చవి చూస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు... నగర జీవనం ఆహ్లాదకరంగా ఉంచేందుకు... పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. నగరంలోని అవసరమైన ప్రాంతాల్లో మల్టీలెవెల్ ఫ్లై ఓవర్లు, స్కైవేలు నిర్మించాలని ఇప్పటికే సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నగరంలోని ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై నాస్‌డాక్‌లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నగర ప్రజలు మంచి వాతావరణంలో నివసించేందుకు, ట్రాఫిక్ ఇబ్బందులు లేని రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. దాదాపు ఐదు గంటల పాటు నిర్వహించిన సుదీర్ఘ సమావేశంలో జంక్షన్ల, కారిడార్లపై వేర్వేరుగా సమీక్షించారు. రహదారులు, స్కైవేలు తలపెట్టిన ప్రాంతాల్లో సర్వే చేయాల్సిందిగా అధికారులను ఆదేశిం చారు. వారంలోగా నివేదిక అందించాలని స్పష్టం చేశారు.
ఎలాంటి సమస్యలు లేని మార్గాల్లో తొలిదశలో పనులు ప్రారంభించాలన్నారు. ముఖ్యమైన రహదారులు, జంక్షన్లు, ప్రస్తు తం వాటి పరిస్థితి, భవిష్యత్‌లో పెరిగే ట్రాఫి క్ రద్దీపై కూలంకషంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితిలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్‌లో ప్రజ లు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వ స్తుందన్నారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలకుఅనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మల్టీలెవెల్ ఫ్లై ఓవర్లు, స్కై వేలు ఎక్కడ అవసరం? ఏ రహదారులు... ఎంతమేర విస్తరించాలనే అంశాలతో పాటు ఎంత వ్యయమవుతుందో నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
అభివృద్ధి చేయాల్సినవి....
నగరంలోని లక్డీకాపూల్, బంజారాహిల్స్ పార్కు పరిసరాల్లోని జంక్షన్లు, ఉప్పల్, ఎల్‌బీనగర్, ఖైరతాబాద్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్, అబిడ్స్, చాదర్‌ఘాట్, జేఎన్‌టీయూ, ఓవైసీ హాస్పిటల్, ఈసీఐఎల్ చౌరస్తా, అంబర్‌పేట, హబ్సిగూడ, తిరుమలగిరి, ప్యారడైజ్, మైండ్‌స్పేస్, కేపీహెచ్‌బీ, బాలానగర్, బోయినపల్లి, సుచిత్ర, మారియట్ హోటల్, బుద్ధభవన్, మాసాబ్‌ట్యాంక్, బీహెచ్‌ఈఎల్, మెహదీపట్నం, మియాపూర్, ఓల్డ్ రాయదుర్గం, గ్రీన్‌ల్యాండ్స్, ఎంజే మార్కెట్, చార్మినార్, గోషామహల్, నల్లకుంట, నాంపల్లి తదితర ప్రాంతాల్లో జంక్షన్లు అభివృద్ధి చేయాల్సి ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లను హైప్రెజర్ కారిడార్లుగా గుర్తించారు.