నయీం కేసులో చర్యలకు సీఎం గ్రీన్ సిగ్నల్
నయీం కేసులో చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. డీజీపీ నివేదిక ఆధారంగా చర్యలకు సిద్ధమవుతోంది. నయీంతో సంబంధమున్న రాజకీయ నేతలు, అధికారులపై వేటు వేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతల నుంచే ప్రక్షాళన మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం.
దీంతో రాజకీయ, అధికార ప్రముఖులకు గుండెల్లో గుబులు మొదలైంది. ప్రాథమిక సమాచారం మేరకు ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు ఎమ్మెల్సీలు, 21 మంది అధికారులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. నయీంతో సంబంధాలు ఉన్న విపక్ష నేతలపై కూడా విచారణ వేగవంతం అయ్యింది. ప్రభుత్వం కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతోందన్న విమర్శలు రాకుండా ఉండేందుకు ముందుగా సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకుని, ఆ తర్వాతే విపక్షాల జోలికి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నింటినీ ఇప్పటికే ఆయనకు అధికారులు అందజేసినట్లు తెలుస్తోంది.