
‘మహా’ తాకట్టు..
► రాష్ట్ర ప్రయోజనాలను మహారాష్ట్రకు తాకట్టు పెట్టిన కేసీఆర్
► గవర్నర్ ప్రసంగంపై చర్చలో కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ధ్వజం
► రాష్ట్రాన్ని సీఎం ఎడారిగా మార్చబోతున్నారని మండిపాటు
► ఒప్పందమే జరగలేదని మహారాష్ట్ర సాగునీటి మంత్రే చెప్పారు
► టీఆర్‌ఎస్సేమో అద్భుత ఒప్పందమంటూ ప్రచారం చేసుకుంటోంది
► తుమ్మిడిహెట్టి ఎత్తు తగ్గింపుతో మన ప్రయోజనాలకు శాశ్వత గండి
సాక్షి, హైదరాబాద్: గోదావరిపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను మహారాష్ట్రకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తాకట్టు పెట్టారని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నేత టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. ‘‘ఇచ్చిపుచ్చుకునే ధోరణి అంటే రాష్ట్రానికి ఏదో రావాలి కదా! అలాకాకపోగా ఉన్నదీ ఊడ్చిపెడతారా?’’ అంటూ నిలదీశారు. గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా ఆదివారం శాసనసభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఆలోచనలు తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించి రాష్ట్రాన్ని ఎడారిగా మార్చబోతున్నాయన్నారు. బీఆర్ అంబేడ్కర్ ప్రాణిహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం గతంలో కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందంతో పోల్చితే తాజాగా కేసీఆర్ ప్రభుత్వం కుదుర్చుకున్న ‘ప్రాణహిత-కాళేశ్వరం’ ఒప్పందంలో ప్రాజెక్టు పేరు మాత్రమే మారిందంటూ ఆక్షేపించారు.
‘‘తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి 72 కి.మీ. దూరం దాకా గ్రావిటీ ఆధారంగా, అక్కడి నుంచి 35 కి.మీ. దూరంలోని ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు లిఫ్టు ద్వారా నీటిని తరలించే అవకాశముంది.కానీ తుమ్మిడిహెట్టి ఎత్తును 148 మీటర్లకు తగ్గించి మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు శాశ్వతంగా తలుపులు మూసేయడమే. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెరిచి ఉంచిన అవకాశాలను టీఆర్‌ఎస్ సర్కారు మూసేసింది’’ అంటూ దుయ్యబట్టారు.మహారాష్ట్రతో అద్భుత ఒప్పందం కుదుర్చుకున్నామని ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంటే.. అసలు ఎలాంటి ఒప్పందమూ జరగలేదని మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రే ప్రకటించారని జీవన్‌రెడ్డి అన్నారు. ‘‘తుమ్మిడిహెట్టి బ్యారేజీ 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 1,852 ఎకరాలే మునుగుతాయి.మేడిగడ్డ వద్ద 103 ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే సాగుకు యోగ్యమైన 3,400 ఎకరాలు ముంపుకు గురవుతాయి. వీటి విషయంలో మహారాష్ట్రను ఒప్పించిన రాష్ట్ర ప్రభుత్వం, 1,852 ఎకరాల తుమ్మిడిహెట్టి ముంపు భూములపై వారిని ఎందుకు ఒప్పించలేకపోయింది? ఈ ప్రాజెక్టులపై ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని చెప్పినా సీఎం వినిపించుకోలేదు. పోలవరం కోసం 7 మండలాలను తీసుకున్న కేంద్రం తుమ్మిడిహెట్టి కోసం 1,852 ఎకరాలు ఇవ్వకుండాపోయేదా?’’ అని ప్రశ్నించారు. ప్రాణహిత ద్వారా గోదావరి జలాలను మళ్లించి కోటి ఎకరాలకు నీళ్లివ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లడగబోనని ‘మిషన్ భగీరథ హామీ’ తరహాలో సీఎం చెప్పగలరా అని సవాలు చేశారు. ‘‘రెండేళ్ల కింది దాకా రూ.30 వేల కోట్లున్న అంచనా వ్యయాలు ఇప్పుడు రూ.80 వేల కోట్లకు చేరాయి. ఈ నిధులు ఎక్కడి నుంచి తెస్తారు?’’ అని ప్రశ్నించారు.
కరువును పట్టించుకోరా?
గతేడాది కరువు మండలాలను ప్రకటించని రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఏడాదేమో నామమాత్రపు ప్రకటన చేసిందని జీవన్‌రెడ్డి తప్పుబట్టారు. కరీంనగర్ జిల్లాలో 40 మండలాల్లో తీవ్ర కరువు ఉందని ప్రతిపాదనలు పంపితే వాటిని 19కి కుదించి ప్రకటించారన్నారు. దీనిపై 3 వారాల్లో పునఃపరిశీలన జరపాలని హైకోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ‘‘ఈ బడ్జెట్ తర్వాత రుణమాఫీకి మరో విడతగా రూ.4,370 కోట్లు చెల్లించాలి. దీంతోపాటు రైతులకు రెండేళ్లుగా చెల్లించాల్సి ఉన్న 6 శాతం వడ్డీ రాయితీ బకాయిలనూ తక్షణమే చెల్లించాలి.మిడ్‌మానేరు ముంపు బాధితులకు పరిహారంగా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించిస్తామని వేములవాడ రాజన్న సన్నిధిలో ఇచ్చిన హామీనీ కేసీఆర్ విస్మరించారు. 14వ ఆర్థిక సంఘం నుంచి జిల్లా పరిషత్, మండలపరిషత్‌కు నిధులు ఆగిపోవడంతో వాటి మనుగడే ప్రశ్నార్థకమైంది. ముస్లింలకు 12 శాతం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల కల్పనలో ప్రభుత్వ తీరు సరిగా లేదు. కేజీ టు పీజీ ఉచిత విద్యపై ఇంకా పురోగతే లేదు’’ అంటూ ధ్వజమెత్తారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లను తెచ్చి బంగారుతల్లి పథకాన్ని రద్దు చేయడమేమిటని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల వ్యయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచాలని, వర్సిటీలకు తక్షణమే వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు.