ఖాకీ ఖతర్నాక్
► పోలీసు శాఖను వ్యూహాత్మకంగా పునర్వ్యవస్థీకరించాలి: కేసీఆర్
► తెలంగాణలో నేరం చేసి బయటకు పోలేమన్న పరిస్థితి నేరస్తులకు కలగాలి
► ఎక్కడ ఏ అవసరం ఉన్నా పోలీసులు నిమిషాల్లో చేరుకోవాలి
► కొత్తగా కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, రామగుండం కమిషనరేట్లు
► కమిషనరేట్ల నుంచి పోలీస్‌స్టేషన్ల దాకా దసరా రోజే ప్రారంభం కావాలి
► పోలీసు శాఖపై సీఎం సమీక్ష.. ఈ నెల 7న కేబినెట్ భేటీకి నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేరం చేసి బయటకు పోలేమన్న పరిస్థితి నేరస్తులకు కలగాలని, ఆ లక్ష్యంతో వ్యూహాత్మకంగా పోలీసు శాఖ పునర్వ్యవస్థీకరణ జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. నేరాలు తగ్గాలని, ప్రజలకు భరోసా కలగాలని, ఎక్కడ అవసరమైతే అక్కడికి నిమిషాల్లో చేరుకునేలా పోలీసు శాఖ సిద్ధంగా ఉండాలన్నారు. అన్ని రకాల నేరాలను అదుపు చేయగలిగేలా పోలీస్ వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా రాష్ట్ర పోలీసు శాఖ పునర్వ్యవస్థీకరణపై బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.
కొత్తగా వచ్చే జిల్లాలు, డివిజన్లు, మండలాల ఆధారంగా పోలీసు శాఖ కూడా తమ కార్యాలయాలు దసరా రోజే ప్రారంభించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. కొత్త పోలీస్‌స్టేషన్ల నుంచి కొత్త కమిషనరేట్ల దాకా అన్నీ సిద్ధం కావాలన్నారు. హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, సీనియర్ పోలీసు అధికారులు మహేందర్ రెడ్డి, మహేశ్ భగవత్, సందీప్ సుల్తానియా, సుధీర్, నాగిరెడ్డి, అకున్ సబర్వాల్, సీఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంతికుమారి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
అవసరమైన ప్రతిచోటా హెలిప్యాడ్
భవిష్యత్ అవసరాలు, పరిణామాలను అంచనా వేస్తూ పోలీసు శాఖ పునర్వ్యవస్థీకరణ జరగాలని సీఎం పేర్కొన్నారు. అవసరమైన ప్రతిచోటా హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో హెలికాప్టర్ల ద్వారా గస్తీ నిర్వహించాల్సి వచ్చినా సిద్ధంగా ఉండేలా వ్యవస్థను తయారు చేసుకోవాలన్నారు.
కొత్తగా నాలుగు పోలీసు కమిషనరేట్లు
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కమిషనరేట్లతోపాటు కొత్తగా కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, రామగుండం పోలీసు కమిషనరేట్లను ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కమిషనరేట్ల పరిధిలోని జిల్లా కేంద్రాల్లో డీసీపీలను, డివిజన్ కేంద్రాల్లో ఏసీపీలను నియమించాలని ఆదేశించారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడే పరిపాలన విభాగాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 25 సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయాలు, 28 పోలీస్ సర్కిల్ కార్యాలయాలు, 86 కొత్త పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలని, వాటిలో అవసరమైన సిబ్బందిని నియమించాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా 119 మండలాలు వచ్చే అవకాశం ఉందని, వీటిలో ఇప్పటికే 33 చోట్ల పోలీస్ స్టేషన్లున్నారుు కాబట్టి.. కొత్తగా 86 స్టేషన్లు ప్రారంభం కావాలన్నారు. ఇంతకుముందు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు శాఖాపరంగా చేపట్టిన చర్యలను అధ్యయనం చేయాలని సూచించారు.
పోలీస్ స్టేషన్లు-జనాభా నిష్పత్తిలో మనమే మెరుగు
నేరాల అదుపులో, అసాంఘిక శక్తులను అరికట్టడంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు మంచి పేరు వచ్చిందని సీఎం చెప్పారు. పోలీస్ కమిషనరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలు, సబ్ డివిజన్, సర్కిల్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల సంఖ్య పెరుగుతున్నందున పోలీస్ స్టేషన్లు-జనాభా విషయంలో దేశ సగటు కన్నా తెలంగాణ మెరుగ్గా ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా 125 కోట్ల జనాభాకు 12,806 పోలీసు స్టేషన్లున్నాయని, ప్రతీ 97 వేల జనాభాకు ఒక పోలీస్ స్టేషన్ ఉందని వివరించారు. తెలంగాణలో పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా పోలీస్ స్టేషన్ల సంఖ్య భారీగా పెంచుతున్నందున ప్రతీ 50 వేల మందికి ఒక స్టేషన్ అందుబాటులో ఉంటుందన్నారు. తెలంగాణ జనాభా 3.60 కోట్లుంటే 709 పోలీస్ స్టేషన్లు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. దీంతో శాంతిభద్రతల పర్యవేక్షణ మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యాలయాల నిర్మాణాలకు రూ.2 వేల కోట్లు
కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుతోనే సరిపోదని, అవి సమర్థంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఏడాదిలోగా జిల్లా కార్యాలయాలతో పాటు మండల స్థారుు కార్యాలయాల నిర్మాణం పూర్తి కావాలని స్పష్టంచేశారు. ఇందుకోసం వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలని, వచ్చే బడ్జెట్లో ఆఫీసుల నిర్మాణం కోసం రూ.2 వేల కోట్లు కేటారుుస్తామని ప్రకటించారు. పోలీసు కార్యాలయాలను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా, ఇతర కార్యాలయాలను ఆర్‌అండ్‌బీ ద్వారా నిర్మిస్తామని వెల్లడించారు. దసరా నాడే జిల్లా కేంద్రాల్లో అన్ని శాఖల కార్యాలయాలు ప్రారంభం కావాలన్నారు.
హైపవర్ కమిటీ నివేదిక తర్వాత తుది రూపు
కె.కేశవరావు నాయకత్వంలో ఏర్పాటైన హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక తర్వాత ఏ జిల్లాలో ఏయే మండలాలు, ఏ డివిజన్లు ఉంటాయనే విషయంలో స్పష్టత వస్తుందని సీఎం చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత డివిజన్లు, మండలాల విషయంలో మార్పుచేర్పులు చేయాలని సూచించారు. కాగా శుక్రవారం(7వ తేదీ) మధ్యాహ్నం 2 గంటలకు సీఎం నేతృత్వంలో సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది.