విపక్షాల ఆందోళనతో దద్దరిల్లిన సభ | KCR x akbaruddin | Sakshi
Sakshi News home page

విపక్షాల ఆందోళనతో దద్దరిల్లిన సభ

Published Sun, Mar 27 2016 3:44 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

విపక్షాల ఆందోళనతో దద్దరిల్లిన సభ - Sakshi

విపక్షాల ఆందోళనతో దద్దరిల్లిన సభ

♦ ఓయూ, హెచ్‌సీయూ ఘటనలపై విపక్షాల ఫైర్
♦ చర్చకు పట్టుబట్టి పోడియం వద్దకు దూసుకొచ్చిన కాంగ్రెస్, ఎంఐఎం
♦ నిరాకరించిన ప్రభుత్వం.. ఆందోళనకు దిగిన విపక్షాలు
♦ రెండు గంటల్లో మూడుసార్లు వాయిదా పడ్డ సభ
♦ మీకు కావాల్సింది చర్చా.. రచ్చా..?: మంత్రి హరీశ్ ఆగ్రహం
♦ వాయిదా తీర్మానం అనుమతించకపోవడం దళితులకు అన్యాయం, అవమానం: అక్బర్
♦ ప్రభుత్వం బీజేపీకి ఆయుధంగా మారిందంటూ విమర్శలు
♦ అక్బర్ మాటలను తప్పుబట్టిన సీఎం కేసీఆర్
♦ ఏది మాట్లాడితే అది ఒప్పుకోబోమని వ్యాఖ్య
 
 సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ, ఉస్మానియా యూనివ ర్సిటీల్లో పరిణామాలపై అసెంబ్లీ అట్టుడికింది. కాంగ్రెస్, ఎంఐఎం ఆందోళనల తో దద్దరిల్లింది. యూనివర్సిటీల్లో ఘటనలపై చర్చకు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని అనుమతించాలంటూ సభ ప్రారంభం కాగానే ఆ పార్టీలు పట్టుబట్టాయి. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడేం దుకు అవకాశం కల్పిస్తామని అధికార పక్షం చేసిన సూచనను కాంగ్రెస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సర్దిచెప్పినా వెనక్కి తగ్గకుండా స్పీకర్ పొడియం వద్ద  ఆందోళనకు దిగారు. దీంతో రెండు గంటల్లో సభ మూడు సార్లు వాయిదా పడింది.

 సభ మొదలైన పది నిమిషాలకే..
 నల్ల కండువాలు ధరించి సభకు వచ్చిన కాంగ్రెస్ సభ్యులు.. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి తమ వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలంటూ స్పీకర్ పొడియం వద్ద ఆందోళనకు దిగారు. ఎంఐఎం సభ్యులు సైతం కొద్ది దూరంలో నిలబడి నిరసన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేయవద్దని బీఏసీ సమావేశంలో ప్రతిపక్ష నేత జానారెడ్డి స్వయంగా చెప్పారని, మరో విధంగా చర్చకు సిద్ధమని శాసనసభ వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు సమాధానమిచ్చారు. అయినా కాంగ్రెస్ సభ్యులు ఆందోళనను కొనసాగించడంతో చర్చ చేయాలనుకుంటున్నారా? రచ్చ చేయాలనుకుంటున్నారా..? అని హరీశ్ వారిపై అగ్రహం వ్యక్తం చేశారు.

హెచ్‌సీయూ, ఓయూలో చోటుచేసుకున్న ఘటనల తీవ్రత దృష్ట్యా ప్రశ్నోత్తరాలను రద్దు చేసి వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని జానారెడ్డి కోరారు. ఇందుకు హోంశాఖ పద్దులపై చర్చలో వర్సిటీలపై మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని, సమాధానాలిస్తామని హరీశ్ బదులిచ్చా రు. ఇది అప్రజాస్వామికం అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అహమ్మద్ పాషా ఖాద్రీ నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్లీ స్పీకర్ పొడియం వద్ద దూసుకొచ్చి ఆందోళనకు దిగారు. దళిత, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం నశించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో 10 నిమిషాలకే సభ వాయిదా పడింది.

 మారని పరిస్థితి.. హరీశ్ ఆగ్రహం
 సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రశ్నోత్తరాలను అడ్డుకున్న కాంగ్రెస్ వాయిదా తీర్మానానికి పట్టుబట్టింది. ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఆ పార్టీ సభ్యులు మరోసారి స్పీకర్ పొడియం వద్దకొచ్చి నినాదాలు చేశారు. దీంతో సభ రెండోసారి వాయిదా పడింది. అనంతరం సభ మళ్లీ ప్రారంభం కాగానే మిగిలిన ప్రశ్నలను వాయిదా వేసినట్లు తెలిపిన డిప్యూటీ స్పీకర్... బడ్జెట్ పద్దులపై చర్చ జరుగుతుందని వెల్లడించారు.

వర్సిటీలతో పాటు ఇతర అంశాలపై కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ, సీపీఎంలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్లీ పొడియం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో మంత్రి హరీశ్.. ‘ప్రశ్నోత్తరాల సమయాన్ని ఊడగొట్టారు.. గంట సభా సమయాన్ని వృథా చేశారు..’ అని ఆగ్రహించారు. ప్రశ్నోత్తరాల తర్వాత అవకాశం కల్పిస్తామ మాట మార్చడం తగదని జానారెడ్డి నిరసన తెలి పారు. ముఖ్యమైన అంశం ఉంటే ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాన్ని అనుమతిస్తామని బీఏసీలో సీఎం హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
 
 ఎవరి గొంతూ నొక్కడం లేదు: కేసీఆర్
  ప్రభుత్వం ఎవరి గొంతూ నొక్కడం లేదని, హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై చర్చకు సిద్ధమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తాము కూడా చర్చను కోరుకుంటున్నామన్నారు. ఆయా ఘటనల్లో బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఓయూలో కాంగ్రెస్ ఎమ్మె ల్యే సంపత్‌కుమార్ కారుపై జరిగిన దాడితోపాటు హెచ్‌సీయూలో విద్యార్థి మృతి సంఘటనలు బాధాకరమన్నారు. హోంశాఖ పద్దులపై జరిగే చర్చలో ఈ అంశాలపై అవకాశం కల్పిస్తామని చెప్పారు. సీఎం వివరణతో సంతృప్తి చెందని జానారెడ్డి మైక్ ఇచ్చినా మాట్లాడకుండా మిన్నకుండిపోయారు. హెచ్‌సీయూ ఘటన దురదృష్టకరమని, చర్చకు సిద్ధమని బీజేపీ పక్ష నేత కె.లక్ష్మణ్ పేర్కొన్నారు.

ఉగ్రవాది యాకుబ్ మెమెన్‌కు విద్యార్థులు మద్దతు తెలపడాన్ని తప్పుపట్టారు. అయితే ఇది హోంశాఖకు సంబంధించిన అంశం కాదని, సామాజిక అన్యాయానికి సంబంధించిందని కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్, జానారెడ్డి అభ్యంతరం తెలిపారు. దళిత, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం నశించాలంటూ కాంగ్రెస్ సభ్యులు మరోమారు స్పీకర్ పొడియం వద్ద ఆందోళనకు దిగారు. ‘‘ఇది పద్ధతి కాదు.. సభ్యులు తమ సీట్ల వద్దకు వెళ్లాలి.. నినాదాలు చేసినంత మాత్రాన గొప్పవాళ్లు కాలేరు. దళిత వ్యతిరేక ప్రభుత్వం అని నినాదాలు చేస్తున్న సంపత్‌కుమార్ ఇంత వరకు ఫిర్యాదు చేయలేదు.’’ అని కేసీఆర్ అన్నారు. . విపక్షాలు పద్ధతి మార్చుకోకపోతే తమ పద్ధతిలో తాము వెళ్తామని హెచ్చరించారు.
 
 కేసీఆర్ x అక్బరుద్దీన్

 సీఎం కేసీఆర్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య సభలో మాటల యుద్ధం చోటుచేసుకుంది. వాయిదా తీర్మానాన్ని అనుమతించకపోవడాన్ని అక్బరుద్దీన్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కన్నా ఆయనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. సభలో మిగిలిన కార్యక్రమాలను వాయిదా వేసి ముఖ్యమైన అంశంపై చర్చ జరపడమే వాయిదా తీర్మానం ఉద్దేశమని అక్బర్ గుర్తుచేశారు. వాయిదా తీర్మానాన్ని, బడ్జెట్ పద్దులపై చర్చను కలపొద్దన్నారు. వాయిదా తీర్మానాన్ని అనుమతించకపోవడం దళితులకు అన్యాయం, అగౌరవం, అమానవీయం అని తీవ్ర స్వరంతో అన్నారు.

ఈ సమయంలో మైక్ కట్ అవడంతో మరింత ఆగ్రహానికి లోనయ్యారు. తమ పార్టీ సభ్యులను స్పీకర్ పొడియం వద్దకు పంపి నిరసన తెలిపారు. ‘నా మైక్ కట్ చేశారు మంచిదే.. కానీ దళితుల గొంతు నొక్కలేరు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీరు బీజేపీకి ఆయుధం(టూల్)గా మారారు’ అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో మైక్ కట్ చేయడం సరైందేనని సీఎం కేసీఆర్ సమర్థించుకున్నారు.  ‘మైక్ ఇస్తాం కానీ, ఏది అంటే అది మాట్లాడితే ఒప్పుకోం’ అని స్పష్టంచేశారు. దళితులకు అన్యాయం, అగౌరవం అన్న మాటలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. తర్వాత అవకాశమిచ్చినా అక్బరుద్దీన్ మాట్లాకుండా మిన్నకుండిపోయారు. స్పీకర్ పోడియం వద్ద ఎంఐఎం సభ్యులకు తోడు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల సభ్యులు సైతం ఆందోళనకు దిగడంతో సభ మూడోసారి వాయిదా పడింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement