విశ్వనగరం కాదు విషాద నగరం: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విశ్వ నగరంగా ప్రచారం చేసుకుంటున్న హైదరాబాద్.. ఒక్కరోజు వర్షానికే విషాద నగరంగా మారిపోయిందని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. నగర విపత్తు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్యాచరణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. గురువారం బీజేఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, హైదరాబాద్ బచావో పేరిట ప్రజలంతా కలసి నగరాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పోలీసులకు ఇన్నోవా వాహనాలను సమకూర్చడం మినహా నగరంలో ప్రభుత్వం చేసిందేమి లేదని విమర్శించారు.
మూడు గంటలు వర్షానికే నగరం అతలాకుతలమై పోయిందని, మరో రెండు గంటలు వర్షం కొనసాగి ఉంటే ప్రమాదకర స్థితి తలెత్తేదని పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లి అవార్డులు తీసుకోవడం తప్ప మంత్రి కేటీఆర్ నగరంలో పనులేమీ చేయడం లేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్ కోసం ప్రత్యేకంగా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను సిద్ధం చేసి, కచ్చితమైన చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.