
అభివృద్ధిలో నంబర్ వన్ అయితే..
‘అభివృద్ధిలో రాష్ట్రం నంబర్ వన్ అంటూ గొప్పలు చెప్పుకుంటుండ్రు.. కానీ ప్రజాభివృద్ధి మాత్రం జీరోలో
► ప్రజా సమస్యలు ఎందుకు పరిష్కారమైతలేవు..?
► ‘అమరుల స్ఫూర్తియాత్ర’ బహిరంగ సభలో కోదండరాం
గజ్వేల్: ‘అభివృద్ధిలో రాష్ట్రం నంబర్ వన్ అంటూ గొప్పలు చెప్పుకుంటుండ్రు.. కానీ ప్రజాభివృద్ధి మాత్రం జీరోలో ఉన్న విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అభి వృద్ధిలో నంబర్ వన్ అయితే ప్రజల సమస్యలు ఎందుకు పరిష్కారం కావు’ అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరగాలనే లక్ష్యంతోనే పోరాటం చేస్తున్నామన్నారు. మూడో విడత అమరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా ఆది వారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం వంటి మామిడి, ములుగు, వర్గల్ మండలం గౌరారం గ్రామాల్లో కోదండరాం రోడ్‌షోలు నిర్వహించారు.
గజ్వేల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంద న్నారు. సొంత రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు ప్రజలకు దక్కుతాయని ఆశిస్తే పరిస్థితి భిన్నంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానం లేదని, చిన్న పరిశ్రమలను బతికించే విధానం రాలేదని వాపోయారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామంటూ ప్రకటనలు గుప్పించిన ప్రభుత్వం.. పంపిణీ చేసిన భూమి కంటే గుంజుకున్నదే ఎన్నో రెట్లు ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్‌లోనే ఎన్నో సమస్యలు తిష్ట వేశాయన్నారు. కొండపోచమ్మసాగర్ నిర్మాణంలో పెద్దోళ్ల భూములొదిలేసి పేదోళ్ల భూములనే లాక్కుంటున్నారని ఆరోపించారు.