
రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న కోదండరాం. చిత్రంలో బండారు దత్తాత్రేయ, గోరటి వెంకన్న తదితరులు
విలీన దినోత్సవంపై రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విలీన దినోత్సవాన్ని ఈ నెల 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేసింది. ఉత్సవాల నిర్వహణ ద్వారా భారత్‌లో హైదరాబాద్ స్టేట్ విలీనమైన చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య ఆకాంక్షలను గౌరవించేలా, నాటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకునేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది. విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేలా కేంద్రమే ఆదేశాలివ్వాలని సమావేశంలో కొందరు వక్తలు పేర్కొన్నారు. ‘సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి’ అనే అంశంపై సోమవారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వివిధ రంగాల ప్రముఖులు ఈ భేటీలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
త్యాగాలు గుర్తు చేసుకోండి: కోదండరాం
హైదరాబాద్ స్టేట్ విలీనాన్ని చారిత్రక వాస్తవంగా గుర్తించాలని.. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా జరపాలని టీజేఏసీ చైర్మన్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య తెలంగాణ ఆకాంక్షల కోసం షేక్ బందగీ, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య వంటి వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకునేందుకు దీనిని ఒక సందర్భంగా చూడాలన్నారు. విలీన దినాన్ని జరుపుకోలేకపోతే చరిత్ర దూరమవుతుందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రితో, ఇతర రాజకీయపార్టీలతో చర్చించడంతో పాటు...
ప్రభుత్వం కూడా అఖిలపక్ష సమావేశం నిర్వహించేలా చొరవ తీసుకోవాలని బండారు దత్తాత్రేయను కోరా రు. విలీన దినోత్సవాల నిర్వహణ ఒక వర్గం పై టార్గెట్ చేసినట్లుగా ఉండకూడదని.. ఈ విషయంగా గతంలో కొన్ని తప్పులు జరిగాయని, అందువల్ల చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబర్ 17 చర్యకు దారితీసిన పరిస్థితులు, నిజాంపై వ్యతిరేకత, భూస్వామ్య వ్యతిరేక ఉద్యమం వంటి వాటిని మతపరమైన దృష్టితో చూడొద్దని సూచించా రు. జేఏసీ తరఫున సెప్టెంబర్ 17న 2 నిమిషాలు మౌనం పాటించి, జాతీయజెండా ను ఎగురవేయాలని నిర్ణయించామని చెప్పారు.
ఎంతో ఘనమైన చరిత్ర..
తెలంగాణ పోరాటానిది ఎంతో ఘనమైన చరిత్ర అని, దానిని అధికారికంగా జరపకపోవడం సరికాదని ప్రముఖ శిల్పి ఎక్కా యాదగిరిరావు పేర్కొన్నారు. ప్రభుత్వం విలీన దినోత్సవాన్ని నిర్వహించాలని గాయకుడు గోరటి వెంకన్న కోరారు. చరిత్రాత్మక దినోత్సవంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను నిర్వహించాలని సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ విజ్ఞప్తిచేశారు. భారత చరిత్రను, హైదరాబాద్ చరిత్రను విడదీసి చూడలేమని జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి పేర్కొన్నారు. విలీనానికి ముందు ప్రజలు పడిన బాధలు, కన్నీటి గాథలు, మహిళల కష్టాలు, కన్నీళ్లు ఎన్నో ఉన్నాయని...
దానికి మతపరమైన రంగు పులమడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రజలపై జరిగిన అకృత్యాలకు కారణం నిజామేనని, ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన నిజాం విగ్రహాన్ని తొలగించాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ప్రొఫెసర్ జియా హసన్ డిమాండ్ చేశారు. సమావేశంలో చుక్కా సత్తయ్య, వెల్చాల కొండలరావు, బాబురావు వర్మ, పాశం యాదగిరి, టీజేఏసీ కో కన్వీనర్ వెంకటరెడ్డి, ప్రొఫెసర్లు లక్ష్మి, లక్ష్మణ్, వరలక్ష్మి, మల్లికార్జున్, మురళీధర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నా వంతు ప్రయత్నం చేస్తా: దత్తాత్రేయ
విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే అంశంపై కేంద్ర మంత్రిగా కాకుండా సీనియర్ రాజకీయవేత్తగా, సామాజిక కార్యకర్తగా తన వంతు ప్రయత్నిస్తానని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రభుత్వంతో త్వరగా చర్చించాల్సి ఉందని తెలిపారు. చరిత్రను వక్రీకరించకుండా.. జరిగిన చరిత్ర, ఉద్యమ స్వభావం తరతరాలుగా తెలుసుకుని స్ఫూర్తి పొందాల్సి ఉందని పేర్కొన్నారు. నిజాం స్టేట్‌లో భాగంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నట్లుగా.. తెలంగాణలోనూ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.