
తన స్వార్థం కోసమే కేంద్రంతో సఖ్యత
చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేత కోటంరెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీతో సీఎం చంద్రబాబు సఖ్యతతో ఉంటున్నది తన స్వార్థప్రయోజనాలకోసమే తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకోసం కాదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలో తమ మిత్రపక్షం అధికారంలో ఉన్నంత మాత్రాన ప్రత్యేకంగా నిధులేమీ ఇవ్వబోమని ఆర్థికమంత్రి జైట్లీ తెగేసి చెప్పాక కూడా ఎన్డీఏలో టీడీపీ కొనసాగుతోందంటే రాష్ట్రప్రయోజనాలకోసం కానేకాదన్నారు.
లక్షన్నర కోట్ల అమరావతి రాజధాని భూదందా, ఓటుకు కోట్లు, నయీమ్ వ్యవహారంపై కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే తాను, తన కుమారుడు లోకేశ్ జైలుకెళ్లాల్సి వస్తుందనే భయంతోనే బాబు ప్రధానితో సఖ్యంగా ఉంటున్నారని విమర్శించారు. అందుకే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకున్నా.. విభజన చట్టంలోని హామీల్ని నెరవేర్చకున్నా సీఎం నిలదీయలేకపోతున్నారన్నారు. విభజనవల్ల అన్యాయమైన ఏపీకి ప్రధానంగా కావాల్సింది ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలని, వీటికి ఇంతవరకు అతీగతీ లేదని శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. రెండున్నరేళ్లుగా సాధించలేంది.. మిగిలిన రెండున్నరేళ్లలోమాత్రం ఏం సాధిస్తారు? అని చంద్రబాబును ప్రశ్నించారు.