టీడీపీ అల్లరి మూకల దాడిలో చినిగిపోయిన ఫ్లెక్సీ
నెల్లూరు(సెంట్రల్): అధికారం పోతుందనే ఆక్రోశం, ఆందోళనతో టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడుతున్నారు. నగరంలో ఏది జరిగినా దాన్ని వైఎస్సార్‌సీపీపైకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నగరంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ నేత తిరుమలనాయుడుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిని నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరులు చేశారంటూ టీడీపీ నేతలు విషప్రచారం మొదలు పెట్టారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర నుంచి ప్రతి ఒక్కరూ హడావుడిగా మొత్తం ఇది వైఎస్సార్‌సీపీ అరాచకాలు చేస్తుందంటూ ప్రచారాలు మొదలు పెట్టా రు. తిరుమలనాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఐదేళ్లలో ఎన్నో వివాదాలు సృష్టించారు. ఎంతో మందితో వ్యక్తిగత వైరం ఉన్నట్లు తెలుస్తోంది. అతని వ్యక్తి గత గొడవల నేపథ్యంలో జరిగిన దాడిని వైఎస్సార్‌సీపీ నాయకులు చేశారంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు.
వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి
తిరుమలనాయుడుపై వ్యక్తిగత కారణాలతో దాడి జరిగితే దాన్ని వైఎస్సార్‌సీపీ చేసినట్లు సృష్టించిన టీడీపీ నాయకులు, తక్షణమే మేయర్ అబ్దుల్ అజీజ్ సోదరులు అబ్దుల్‌జలీల్ 50 మందిని వెంట వేసుకుని రూరల్ వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి చేశారు. ఎమ్మెల్యేకు చెందిన ఫ్లెక్సీలు చించివేయడమే కాకుండా, కార్యాలయంలో నానా బీభత్సం సృష్టించారు. బీద రవిచంద్ర ఆదేశాలతో మేయర్ అబ్దుల్ అజీజ్ సోదరుడు అబ్దుల్ జలీల్ అరాచకానికి పాల్పడ్డాడు. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ టీడీపీ ఓడిపోతుందనే భయంతో టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడుతున్నారంటూ చర్చించుకున్నారు.
పోలీసుల ప్రేక్షక పాత్ర
టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడిపై దాడి జరిగిన తర్వాత నుంచి పోలీసులు రూరల్ కార్యాలయం వద్ద ఉన్నారు. కానీ అంత మంది పోలీసులు ఉన్నా, టీడీపీ నాయకులు వచ్చి వైఎస్సార్‌సీపీ రూరల్ కార్యాలయంలోకి చొరబడి నానా బీభత్సం చేస్తున్నా.. అక్కడే ఉన్న పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన తర్వాత నింపాదిగా వచ్చిన పోలీసులు దాడి చేస్తున్న వారిని తీసుకుని వ్యానులో ఎక్కించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ముందుగానే దాడి చేస్తామని పోలీసులకు సమాచారం టీడీపీ నేతలు అందించగా, కావాలనే పోలీసులు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment