గురువారం కోఠి ఉమెన్స్ కళాశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి. చిత్రంలో నవీన్ మిట్టల్ తదితరులు
హైదరాబాద్: నగరంలోని కోఠి ఉమెన్స్ కళాశాలను తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మారుస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం ఆయన కాలేజీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్కడ మౌలిక వసతులు, బోధనా తీరు, విద్యావిధానం వంటి అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చే అవకాశాలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో వచ్చే విద్యా ఏడాది నుంచే వర్సిటీని ప్రారంభిస్తామన్నారు. 40 ఎకరాల్లో విస్తరించిన ఈ కళాశాలలో బోధనా వసతులు బాగున్నాయని ప్రశంసించారు. రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన విద్యార్థినులతో పాటు విదేశాలకు చెందిన వారు కూడా ఇక్కడ చదువుతున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోని పద్మావతి మహిళా వర్సిటీ విభజన అనంతరం ఏపీకి వెళ్లడంతో రాష్ట్రానికి మహిళా విశ్వవిద్యాలయం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మహిళా వర్సిటీని ఏర్పాటు చేయాలని, కేంద్రం ఇందుకు తగిన సాయం చేయాలని ఇటీవల కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరినట్లు చెప్పారు.
ఆ ఒక్కటే కొరత
కోఠి ఉమెన్స్ కళాశాలలో 42 యూజీ, పీజీ కోర్సులు కొనసాగుతున్నాయని ఒక్క పరిశోధన మాత్రమే లేదని, వర్సిటీగా మారితే అది కూడా ప్రారంభమవుతుందని కడియం చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ స్వర్ణోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ వర్సిటీకి రూ. 200 కోట్లు, ఓయూ అనుబంధ కళాశాలగా ఉన్న ఉమెన్స్ కాలేజీకి రూ. 37 కోట్లు కేటాయించారన్నారు. ఈ రూ.37 కోట్ల నిధులతోనే ఆయా భవనాల మరమ్మతులు కొనసాగుతున్నాయన్నారు. అధికారుల నివేదిక అనంతరం వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ఇతర వసతులు కూడా కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఓయూ వీసీ రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment