సర్కారు వైఖరిపై ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ఆవేదన
ఆత్మగౌరవం దెబ్బతినేలా పోలీసులతో తనిఖీలా?
తనిఖీలు ఆపకుంటే కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి
హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థలపై పోలీసులతో తనిఖీలు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) తీవ్రంగా మండిపడింది. రాష్ట్రంలో 85 శాతం విద్యావ్యాప్తికి దోహదపడుతున్న ప్రైవేటు విద్యాసంస్థలపై ఏకపక్షంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొంది. కనీసం తమను చర్చలకు పిలవకుండా, సంప్రదించకుండా తనిఖీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమేంటని ప్రశ్నించింది. తనిఖీల పేరుతో తమ పొట్టల మీద కొట్టొద్దని అభ్యర్థించింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో తనిఖీలు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల యాజమాన్యాలు తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీగా ఆవిర్భవించాయి. జేఏసీ కన్వీనర్ గింజల రమణారెడ్డి, ప్రతినిధులు శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. విద్యాసంస్థల్లో పోలీస్, ఇంటెలిజెన్స్, ఏసీబీ, విజిలెన్స్ తదితర శాఖాధికారులతో ప్రభుత్వం తనిఖీలు నిర్వహిస్తామన డం అన్యాయమన్నారు.
అది రాష్ట్రానికే అవమానకరం
తెలంగాణలోని విద్యాసంస్థలు బోగస్ అని ప్రకటించడం రాష్ట్రానికే అవమానకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. తనిఖీలకు తాము వ్యతిరేకం కాదని, అయితే సంబంధిత విద్యాశాఖ అధికారులతోనే తనిఖీలు చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన విద్యాసంస్థల యాజమాన్యాలనే దోపిడీదారులుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన చెందారు. లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటున్న కార్పొరేట్ విద్యాసంస్థల జోలికి ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. ఆదివారంలోగా తనిఖీల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే.. తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెలాఖరులోగా రూ. 3,500 ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్లు భాస్కర్ రెడ్డి, కె. సిద్ధేశ్వర్, కో ఆర్డినేటర్ ఎస్‌ఎన్ రెడ్డి, అధికార ప్రతినిధి గౌరీ సతీశ్, రాంచందర్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.