
‘మేకిన్ ఇండియా’లో దేశీ టెక్నాలజీలకే పెద్దపీట
- రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి
- ఐఐసీటీలో సిరామిక్స్‌పై అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం ఉద్దేశం విదేశీ కంపెనీలను ఇక్కడకు రప్పించడం కాదని... కొత్త కొత్త ఆలోచనలతో వస్తు, సేవలను ఇక్కడే రూపొందించి ప్రపంచానికి ఎగుమతి చేయడమని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు, క్షిపణి, వ్యూహాత్మక వ్యవస్థల చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే చాలా అంశాల్లో ఇప్పటికీ విదేశీ దిగుమతులపై ఆధారపడి ఉన్నామని, ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరమెంతైనా ఉందని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ‘సిరామిక్స్, గాజు రంగాల్లో కొత్త ఆవిష్కరణలు’ అన్న అంశంపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు సతీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశీయ పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు.
మనమే తయారు చేసుకోవాలి...
దేశంలోని ఏ ఫ్యాక్టరీకి వెళ్లినా జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలు కనిపిస్తున్నాయని.. బదులుగా మనమే వాటిని తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో తొలి ప్రాధాన్యం దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీకేనన్నది గుర్తించాలని చెప్పారు. రక్షణ రంగంలో సిరామిక్స్ పాత్ర ఎంతో కీలకమని, అద్భుతమైన లక్షణాలు కలిగిన సిరామిక్స్ లేకుంటే క్షిపణుల్లో వాడే కీలకమైన పరికరాల తయారీ చాలా కష్టమయ్యేదని పేర్కొన్నారు. కానీ ఈ రంగంలో ఇప్పటికీ ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటున్నామని, వాటిని అవసరమైన ఉత్పత్తులుగా మార్చే విషయంలో, తయారీ యంత్రాల విషయంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.
ఇక్కడి కంపెనీలకే ప్రాధాన్యం
కొత్త టెక్నాలజీలు, పదార్థాల విషయంలో కేంద్రం దేశీ కంపెనీలకే ప్రాధాన్యమిస్తుందని సతీశ్‌రెడ్డి చెప్పారు. టెండర్లలో కనిష్ట ధర కోట్ చేసిన కంపెనీలకు కాకుండా.. ఆయా టెక్నాలజీలు దేశీయంగానే అభివృద్ధి చేసి ఉంటే, ధర ఎక్కువైనా ఆ టెక్నాలజీనే, పదార్థాన్నే వాడతామని తెలిపారు. దేశంలోని అన్ని రకాల పదార్థాలను సమర్థంగా వినియోగిం చుకునేందుకు వీలుగా కేంద్రం సరికొత్త విధానాన్ని సిద్ధం చేస్తోందన్నారు. డాక్టర్ బలదేవ్‌రాజ్ ఆధ్వర్యంలోని కమిటీ ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సిద్ధం చేసిన ఈ ముసాయిదాను మరో నెలలో ప్రభుత్వానికి సమర్పించనుందని తెలిపారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిరామిక్ టెక్నాలజీస్, ఆలిండియా పాటరీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూమెటీరియల్స్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి వచ్చిన దాదాపు 500 మంది పాల్గొంటున్నారు.