న్యాయవాది ‘డ్రంకన్ డ్రైవ్’
బేగంపేట ఫ్లైఓవర్‌పై బొలేరో బీభత్సం
బైక్‌ను ఢీ కొట్టడంతో ఒకరి దుర్మరణం.. ఇతర వాహనాలపైకి దూసుకెళ్లడంతో పలువురికి గాయాలు
హైదరాబాద్: ఓ న్యాయవాది తప్పతాగి మితిమీరిన వేగంతో వాహనాన్ని నడిపించి బీభత్సం సృష్టిం చాడు. ద్విచ్రక వాహనాన్ని ఢీకొట్టి ఒకరి మృతికి కారణమయ్యాడు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ బేగంపేటలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఏసీపీ చంద్రశేఖర్‌గౌడ్ గురువారం వెల్లడించారు. హైదరాబాద్ రసూల్‌పురాకు చెందిన కె.శ్రీకాంత్(27) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. బుధవారం సాయంత్రం బంజారాహిల్స్‌లో తెలిసినవారి ఇంట్లో బరాత్(పెళ్ళి ఊరేగింపు)కు శ్రీకాంత్ తన స్నేహితులు నరేందర్, శేఖర్‌లతో కలసి వెళ్లారు.
అర్ధరాత్రి తర్వాత బైక్‌పై ఇంటికి వస్తుండగా బేగంపేట్ ఫ్లైఓవర్‌పై బొలేరో వాహనం(డీఎల్ 12సీఏ 4642) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. నరేందర్, శేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా ఫ్లైఓవర్‌పై దిమ్మెను తాకుతూ వచ్చి అతివేగంగా వచ్చిన బొలేరో వాహనం బైక్‌ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. అటుగా వెళ్తున్న పలువురు గమనించి దానిని వెంబడించారు. చివరికి ప్యారడైజ్ వద్ద ఆ వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అయితే బొలేరో వాహనం నడుపుతున్న వ్యక్తి సికింద్రాబాద్‌కు చెందిన న్యాయవాది రంజన్ అని, అతడు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు.
రంజన్ తాగి, అతివేగంగా డ్రైవ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. న్యాయవాదే తప్పతాగి డ్రైవ్ చేసి ఒకరు మృతికి కారణం కావడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డవారికి న్యాయస్థానాలు శిక్షలు విధిస్తుండగా, అదే న్యాయస్థానంలో పనిచేసే న్యాయవాదే తాగి డ్రైవ్ చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పలు సెక్షన్ల కింద రంజన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబం
ప్రమాదంలో మృతి చెందిన శ్రీకాంత్ మీదనే తన కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. అతని భార్య శ్రీదేవి, ఇద్దరు చంటి పిల్లలు ఉన్నారు. శ్రీకాంత్ మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్నే నింపింది. ఆ చిన్నారులు నాన్న ఏడని అడిగితే ఏం చెప్పాలంటూ భార్య శ్రీదేవి రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. చంటి బిడ్డలను భుజాన వేసుకుని ఇక తమకు దిక్కెవరంటూ విలపించడం కంటతడి పెట్టించింది. తమను కంటికి రెప్పలా చూసుకుంటాడనుకున్న కుమారుడు ఇక లేడన్న వార్తను ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక న్యాయవాది తప్పిదం ఆ కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టింది.
గాయపడ్డ నరేందర్ జాతీయస్థాయి బాక్సింగ్ ప్లేయర్
ప్రమాదంలో గాయపడ్డ నరేందర్ బాక్సింగ్ ప్లేయర్‌గా మంచి గుర్తింపు ఉంది. జాతీయస్థాయి టోర్నమెంట్లలో సైతం పాల్గొన్నాడు. తను రాయాల్సిన గురువారంనాటి పాలిటెక్నిక్ ప్రవేశపరీక్షకు గాయం కారణంగా దూరమయ్యాడు.