
హైకోర్టు విభజన కోరుతూ లాయర్ల రిలే దీక్షలు
హైదరాబాద్: హైకోర్టు విభజన కోరుతూ తెలంగాణ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. హైకోర్టు విభజనకు కమిటీ వేసి వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ చైర్మన్ ఎం.రాజేందర్‌రెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఇక్కడ పురానీహవేలిలోని సిటీ సివిల్ కోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో కోర్టు గేటు బయట చేపట్టిన రిలే నిరాహారదీక్షలను వారు ప్రారంభించారు.
అనంతరం జూలై ఒకటో తేదీన నిర్వహించే ‘చలో హైదరాబాద్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ సీమాంధ్ర జడ్జీలు ఇచ్చిన ఆప్షన్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తాము చేపట్టిన నిరసనకు మద్దతుగా జ్యుడీషియల్ ఆఫీసర్లు గవర్నర్‌ను కలసి రాజీనామాపత్రాలు అందజేశారని చెప్పారు. జూలై 1వ తేదీ వరకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కో-కన్వీనర్లు ఎ.మాణిక్‌ప్రభు గౌడ్, ఎం.ఎస్.తిరుమల్‌రావు, సిటీ సివిల్‌కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కరాజు హరిరావు, మాజీ అధ్యక్షుడు విద్యాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పురానీహవేలి సిటీ సివిల్ కోర్టు న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహారదీక్షను పురస్కరించుకొని పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.