అక్రమంగా కొన్నవారిపై కాకుండా రాసిన వాళ్లపై కేసులా?
మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో భూములను అక్రమంగా కొన్నవారిపై చర్యలు తీసుకోకుం డా, వాటి గురించి రాసిన వాళ్లపై కేసులు పెడుతూ మీడియాను బెదిరిస్తారా.. ఇదెక్కడి న్యాయం అంటూ సీఎం చంద్రబాబుపై మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. మిగిలిన పేపర్లు, చానళ్లు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుంటే.. ఒక పేపర్‌లో వ్యతిరేకంగా రాస్తే ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం ఆయన శాసనమండలిలో మాట్లాడారు.
ప్రభుత్వానికి ధైర్యముంటే భూముల వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ సభలో తీర్మానం చేయాలని సవాల్ విసిరారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకముందే రాజధానిని ఎక్కడ నిర్మిస్తారనే విషయం ముందుగానే ప్రకటించే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తిని పక్కనపెట్టి రాజధాని ప్రాంతంలో భూములు సేకరించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణంపై ముందుగానే లీకులు ఇవ్వడంతోనే అధికార పార్టీ నేతలు అక్కడ భూములు కొనుగోలు చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను కేంద్రమే చేపట్టాల్సి ఉన్నా... రాష్ట్ర ప్రభుత్వం ఏం లాభం ఆశించి తన భుజాన వేసుకుందని ప్రశ్నించారు.