ప్రతినిధీ... ఇదీ మీ విధి | Leader this is your Duty | Sakshi
Sakshi News home page

ప్రతినిధీ... ఇదీ మీ విధి

Published Mon, Jan 25 2016 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

ప్రతినిధీ... ఇదీ మీ విధి

ప్రతినిధీ... ఇదీ మీ విధి

నీళ్లు, రోడ్లు, మురుగు సమస్యలే మా ఎజెండా
♦ వీటిని పరిష్కరించే వారికే ఓటేస్తాం
♦ నినదిస్తున్న నగర ఓటర్లు
♦ ఆవాజ్‌దో సంస్థ ఓటింగ్ క్యాంపెయిన్‌కు వెల్లువెత్తుతోన్న ఫిర్యాదులు
♦ సమర్థులకు ఓటేస్తామన్న 68.4 శాతం మంది
♦ ఓటుతోనే స్థానిక సమస్యల పరిష్కారం సాధ్యమన్న 83.2 శాతం ఓటర్లు
 
 బల్దియా పోరులో స్థానిక సమస్యల పరిష్కారమేగ్రేటర్ జనం జెండా..ఎజెండాలుగా మారాయి. ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలు..హంగు..ఆర్భాటాల కన్నా నిత్య జీవితంలో తాము ఎదుర్కొంటున్న రోడ్లు, తాగునీరు, మురుగు నీటి సమస్యలను పరిష్కరించే వారికే తమ ఓటు అని మహానగర ఓటర్లు ఎలుగెత్తి చాటుతున్నారు. మౌలిక వసతులు లేకుండా...మల్టీ లెవల్ ఫ్లైఓవర్లు, మల్టీప్లెక్స్‌లు, హైటెక్ హంగులు అక్కర్లేదని స్పష్టంచేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడంతోపాటు జనాన్ని చైతన్యం చేసేందుకు ‘ప్రామాణ్య స్ట్రాటజీ’ అనే రాజకీయ పరిశోధన సంస్థ ప్రారంభించిన ‘ఆవాజ్ దో హైదరాబాద్’ ఓటింగ్ క్యాంపెయిన్‌లో వేలాది మంది ఓటర్లు పాల్గొని తమ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడిస్తున్నారు. ప్రజాప్రతినిధులు సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
 
 ప్రామాణ్య స్ట్రాటజీ సంస్థ ఆధ్వర్యంలో గత పదిరోజులుగా నగర వ్యాప్తంగా సుమారు 12 వేల మంది ఓటర్ల నుంచి ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్‌సైట్లు, టెలీకాలింగ్ వంటి మాధ్యమాలు, నేరుగా కలిసి మాట్లాడడం ద్వారా సేకరించిన అభిప్రాయాలను ఈ సర్వేలో క్రోడీకరించారు.  ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. సింహభాగం ఓటర్లు స్థానిక సమస్యలు పరిష్కరించేవారికే తమ ఓటు అని  స్పష్టం చేయడం విశేషం. ఈ సర్వేలో తేలిన పలు అంశాలు మహానగర ఓటర్ల మనోగతానికి అద్దం పడుతున్నాయి. సర్వే వివరాలివే...

 మా సమస్యలు పరిష్కరించేవారికే ఓటేస్తాం
 మా వీధి, వార్డులో పేరుకుపోయిన దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించేవారికి, నిత్యజీవితంలో మేము పడుతున్న అవ స్థలకు శాశ్వతంగా చరమగీతం పాడే అభ్యర్థికే ఓటేస్తామని ఈ సర్వేలో సుమారు 68.4 శాతం మంది ప్రజలు తెలిపారు. మరో 24.9 శాతం మంది మాత్రం అభ్యర్థులతో పనిలేకుండా తమకు నచ్చిన రాజకీయ పార్టీ గుర్తుకే ఓటు వేస్తామని స్పష్టం చేశారు. ఇక 3.7 శాతం మంది ఎవరికీ ఓటు వేయమన్నారు. మరో 3 శాతం మంది ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ గడపకూడా తొక్కబోమని తెలపడం గమనార్హం.

 సర్వత్రా.. మంచినీటి కటకట
 ఇక నగరవ్యాప్తంగా జనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య తాగు నీటి ఎద్దడి. వారం, పదిరోజులకోమారు జలమండలి సరఫరా చేస్తున్న నల్లా నీటి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నామని..గొంతు తడుపుకునేందుకు నానా అవస్థలు పడుతున్నామని ఆందోళన వ్యక్తంచేశారు. నల్లా నీళ్లు రాకపోవడం, బోరుబావులు వట్టిపోవడంతో ప్రైవేటు నీటి ట్యాంకర్‌లు, ఫిల్టర్‌ప్లాంట్లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నామని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీరు, డ్రైనేజి పైపులైన్లు పక్కపక్కనే ఉన్నచోట రంగుమారి దుర్వాసన వెదజల్లుతున్న కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. వివిధ అభివృద్ధి పనుల కోసం రహదారులను తవ్వి వదిలేస్తుండడంతో గతుకుల రోడ్లతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇక మురుగు నీటి పైపులైన్లకు ఏర్పడుతున్న లీకేజీలతో మురుగు నీరు రహదారులను ముంచెత్తుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామని, వీటికి నిర్దిష్ట పరిష్కారాలు చూపి, వాటిని పరిష్కరిస్తామని విస్పష్టమైన హామీ ఇచ్చినవారికే తాము ఓటేస్తామని స్పష్టం చేశారు.

 అయినా ఓటేస్తాం.. చరిత్రను మార్చేస్తాం..
 తెలంగాణా రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న బల్దియా ఎన్నికల్లో తాము ఓటేస్తామని..ఓటేసేందుకు ఆసక్తిగా ఉన్నామని..సమస్యల పరిష్కారానికి ఓటు అనే ఆయుధంతో యుద్ధం చేస్తామని మెజార్టీ సిటీజనులు పేర్కొనడం కొసమెరుపు.

 తీవ్ర తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలివే..
 భోలక్‌పూర్,మల్లాపూర్,చాంద్రాయణగుట్ట,,లాల్‌దర్వాజ,కార్వాన్,మాసాబ్‌ట్యాంక్,మియాపూర్,మెహిదీపట్నం,సైదాబాద్,మొఘల్‌పురా,ఫలక్‌నుమా,ముషీరాబాద్,మీర్‌పేట్,నాచారం,పత్తర్‌ఘట్టీ,కుత్భుల్లాపూర్,ఈసీఐఎల్,ఆర్‌కెపురం,రాజేంద్రనగర్,సంతోష్‌నగర్,హిమాయత్‌నగర్,సీతాఫల్‌మండి,లింగోజిగూడా,వెంకటాపురం,మల్కాజ్‌గిరీ,బాలాపూర్,సికింద్రాబాద్,బాపూనగర్,లంగర్‌హౌజ్,దోమల్‌గూడ, జగద్గిరిగుట్ట,సరూర్‌నగర్‌లలో నీటి ఎద్దడి ఉన్నట్లు ఓటర్లు పేర్కొన్నారు.
 
 మంచినీరు, రహదారులు, మురుగు సమస్యలకే అధిక ప్రాధాన్యం
 ప్రజల ఎజెండాలో అరకొర నీటి సరఫరా, కలుషిత జలాల నివారణ, అధ్వాన్న రహదారులు..ఈ మూడు సమస్యలేతొలి ప్రాధాన్యాలుగా నిలిచాయి. ఈ సమస్యల నుంచి తమకు విముక్తి కల్పిస్తామని గట్టిగా హామీ ఇచ్చిన వారికే ఓటు వేస్తామని జనం స్పష్టం చేశారు. జనం ఎజెండాలో 34 శాతం మంది మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరగా..మరో 22.7 శాతం మంది అధ్వాన్న, గతుకుల రహదారులకు తక్షణం మరమ్మతులు చేపట్టాలని కోరారు. మరో 18.6 శాతం మంది కాలనీలు, బస్తీలు, వీధుల్లో పొంగిపొర్లుతున్న మురుగు ప్రవాహంతో తాము పడుతున్న అవస్థలను పరిష్కరించే పార్టీలు, అభ్యర్థులకే ఓటు వేస్తామని స్పష్టంచేశారు. మరో 5.7 శాతం మంది చెత్త సమస్యతో బాధపడుతున్నట్లు వివరించారు. ఇక మరో 19 శాతం మంది విద్యుత్ కట్ కట, వీధి దీపాలు లేక అలుముకుంటున్న చీకట్లు, ట్రాఫిక్ రద్దీ, ప్రజారవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, చాలినన్ని బస్సులు లేకపోవడంతో తాము పడుతున్న అవస్థలు, వీధికుక్కల బెడద, మూతలు లేని మ్యాన్‌హోళ్లు, కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదు చేశారు. వీటిని పరిష్కరించేవారికే ఓటు వేస్తామని చెప్పడం గమనార్హం.
 
 ఓటు వజ్రాయుధమే...
 అవును..మేము దైనందిన జీవితంలో ఎదుర్కొంటు న్న సమస్యలను ఓటు అనే వజ్రాయుధంతో పరిష్కరించుకుంటామని సర్వేలో 83.2 శాతం మంది గ్రేటర్ ఓటర్లు అభిప్రాయపడ్డారు. 10.8 శాతం మంది రాజకీయ పార్టీల మేనిఫెస్టో చూసి ఓటేస్తామని చెప్పగా.. మరో 6 శాతం మంది ఏదీ చెప్పలేమన్నారు. అయితే ఓటేయాలన్న కోరిక తమలో బలంగా ఉన్నప్పటికీ తమ నిరాసక్తతకు పలు కారణాలు వివరించారు. వివిధ రాజకీయ పార్టీలు కార్పొరేటర్ అభ్యర్థులను ఎంపిక చేసిన తీరు బాగాలేదని, ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడం, డబ్బు, మద్యం పంపిణీతో పలు పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టడం చూసి విసిగిపోయామని, ఒక వేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఓటేసినా మా సమస్యలను తీర్చే నిధులు, విధులు, అధికారాలు బల్దియాకు లేవని, అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
 
 కార్పొరేటర్ల పనితీరు....
  గత బల్దియా ఎన్నికల్లో తాము ఎన్నుకున్న
 కార్పొరేటర్లు తమ సమస్యల పరిష్కారం విషయంలో, నిత్యం అందుబాటులో ఉండే విషయంలో తమను నిరాశ పరిచినట్లు పలువురు సిటీజనులు తెలిపారు. తమ ఫిర్యాదులపై తక్షణం కార్పొరేటర్లు స్పందించారని 39.8 శాతం మంది తెలపగా..అంతగా చొరవచూపలేదని, ముభావంగా స్పందించారని, చూద్దాం..చేద్దాం అన్న ధోరణితో వ్యవహరించారని 25.3 శాతం మంది తెలిపారు. ఇక 34.9 శాతం మంది మాత్రం అసలు తాము ఎనుకున్న కార్పొరేటర్లు సమస్యల  వైపు కన్నెత్తి చూడలేదని కుండబద్దలు కొట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులపై ఎక్కువ మంది తమ అసంతృప్తిని తె లియజేయడం విశేషం.
 
 ట్రాఫిక్ జాంఝాటం...
 అల్వాల్, నల్లకుంట, చైతన్యపురి ఓటర్ల ఫిర్యాదులు ఇక్కడి నుంచే...

 అధ్వాన రహదారులు..
 బహదూర్‌పురా, మల్కాజ్‌గిరీ, బండ్లగూడ, కాచిగూడా, బోయిన్‌పల్లి, చార్మినార్, ఘానీభాగ్, మలక్‌పేట్, గోల్కొండ, తలాబ్‌కట్ట, హైదర్‌గూడా,లంగర్‌హౌజ్, జియాగూడా, బోరబండ, మణికొండ, యాకుత్‌పురా, మేడ్చల్, ఎల్బీనగర్, ఓల్డ్‌బోయిన్‌పల్లి, సరూర్‌నగర్, ఎల్లారెడ్డిగూడా, ముషీరాబాద్, జీడిమెట్ల, కూకట్‌పల్లి, సనత్‌నగర్, ఉప్పుగూడా, మోతీనగర్, ఈసీఐఎల్, రాజేంద్రనగర్, హిమాయత్‌నగర్, లింగోజిగూడ.
 
 మురుగు అవస్థలు...
 బంజారాహిల్స్, ఎల్భీనగర్, చిక్కడపల్లి, మలక్‌పేట్, శివరాంపల్లి, తలాబ్‌కట్ట, బేగంబజార్, లంగర్‌హౌజ్, బేగంపేట్, బోరబండ, చంపాపేట్, కార్వాన్, చింతల్, మియాపూర్, ఐఎస్‌సదన్, యూసుఫ్‌గూడా, కొత్తపేట్, కూకట్‌పల్లి, కృష్ణానగర్, మైలార్‌దేవ్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్, కాచిగూడా, సైదాబాద్, ఫలక్‌నుమా, మీర్‌పేట్, మోతీనగర్
 
 విద్యుత్ కట్‌కట..
 ఆజంపురా, ఛత్రినాక , కుర్మగూడా, మదీనా, ఉప్పుగూడా, యూసుఫ్‌గూడా, యాకుత్‌పురా
 
 చెత్త సమస్యలిక్కడే..
 కర్మన్‌ఘాట్, పంజాగుట్ట, రామ్‌కోఠి, ఈస్ట్‌ఆనంద్‌బాగ్, హాజిపురా, యాకుత్‌పురా, పత్తర్‌ఘట్టీ, అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, మల్కాజ్‌గిరి.
 
 వీధికుక్కలు, అపరిశుభ్రత
 సికింద్రాబాద్, హయత్‌నగర్, అంబర్‌పేట్, పద్మారావునగర్,  మన్సూరాబాద్,ముషీరాబాద్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement