హెచ్‌ఎండీఏలో గవర్నింగ్ కౌన్సిల్?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు రాజకీయ ప్రాతినిధ్యంతో కూడిన పాలకమండలిని నియమించే దిశగా ప్రభుత్వ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. గతంలో ‘హుడా’గా ఉన్న సమయంలో రద్దు చేసిన పాలకమండలికి మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైందన్న ప్రచారం జోరందుకుంది. ఈ తాజా నిర్ణయంలో నగరాభివృద్ధి, ప్రజల శ్రేయస్సు, ఉన్నత ఆశయాలు, లక్ష్యాలు ఏవీ లేకపోయినా... పదవుల పందేరమే ప్రధాన ఎజెండాగా పాలకమండలిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు వినికిడి.
చట్టం సవరించే వ్యూహం...
గ్రేటర్ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో స్థానికంగా కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలకు పాలక మండలిలో స్థానం కల్పించడం ద్వారా గ్రేటర్‌లో పార్టీకి గట్టి పునాదులు వేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఇందుకుగాను అవసరమైతే హెచ్‌ఎండీఏ చట్టాన్ని సవరించి వారికి పదవులు కట్టబెట్టేందుకు పక్కాగా వ్యూహరచన జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. గతంలో హుడా రూపంలో ఉన్నప్పుడు ఈ పాలక మండలికి ఒక చైర్మన్, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు కౌన్సిలర్లు, మరో ఐదుగురు ప్రభుత్వం నియమించిన సభ్యులు రాజకీయంగా ప్రాతినిధ్యం వహించేవారు.
హెచ్‌ఎండీఏగా మార్పు చెందాక ముఖ్యమంత్రి చైర్మన్‌గా, మున్సిపల్ శాఖ మంత్రి వైస్‌చైర్మన్‌గా, హెచ్‌ఎండీఏ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా, ఇతర ఉన్నతాధికారులు సభ్యులుగా బోర్డును ఏర్పాటు చేశారు. ఇందులో నేరుగా రాజకీయ ప్రాతినిధ్యం తక్కువ. సీఎం చైర్మన్‌గా ఉండటం వల్ల అధికార పార్టీకి రాజకీయంగా కలిసొచ్చేదేమీ లేదు. సమయాభావం వల్ల సీఎం కూడా దీన్ని నేరుగా పర్యవే క్షించడం సాధ్యంకాదు. ఈ క్రమంలో ఈ పదవిని నగరానికి చెందిన నేతకు అప్పగిస్తే ప్రయోజనదాయకంగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు. టీఆర్ ఎస్ తీర్థం తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్న నగర కాంగ్రెస్ ప్రముఖ నేత ఒకరికి ఈ పదవిని అప్పజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు ఈ వ్యూహం వేసినట్లు సమాచారం.
పాలనకు గండి...
అధికారుల చేతుల మీదుగా సాఫీగా సాగిపోతున్న హెచ్‌ఎండీఏ పాలనలో రాజకీయ నేతల రంగప్రవేశం జరిగితే పరిస్థితి దిగజారుతుందనే వాదన వినిపిస్తోంది. అంతే కాకుండా ఆయా పాలకమండలి నాయకులకు వాహన సదుపాయాల వంటివాటి రూపంలో హెచ్‌ఎండీఏపై అదనపు భారం పడుతుంది. విధాన నిర్ణయాలను శాసిస్తూ ఈ నాయకులు పైరవీలకు తెరతీసే అవకాశం ఉంది. అయితే... హెచ్‌ఎండీఏ ఏర్పాటయ్యాక పరిపాలన అధికారుల చేతుల్లోకి రావడంతో పరిస్థితులు చక్కబడి ప్రజలకు సత్వర సేవలందుతున్నాయి. ఈ నేపథ్యంలో... మళ్లీ పాలక మండలిని నియమిస్తే హెచ్‌ఎండీఏ అక్రమాల పుట్టగా మారుతుందన్న భయం నగరవాసుల్లో వ్యక్తమవుతోంది.
అసెంబ్లీలో ఆమోదం పొందాలి...
హెచ్‌ఎండీఏలో పాలకమండలిని నియమించాలంటే ఇప్పుడున్న చట్టాన్ని (యాక్ట్‌ను) సవరించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టి అక్కడ ఆమోదం పొందాక సవరించాల్సి ఉంటుందంటున్నారు. అసెంబ్లీని సమావేశపర్చే పరిస్థితి లేనప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా కూడా పాలకమండలిని ఏర్పాటు చేయవచ్చంటున్నారు. అయితే ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసినా... మెజార్టీ రూలింగ్ ప్రభుత్వానిదే కనుక చట్టాన్ని సవరించడం కష్టమేమీ కాద న్నది కొందరి అభిప్రాయం.