నెల రోజులపాటు కూల్చబోమని హైకోర్టుకు ఏజీ హామీ
సాక్షి, హైదరాబాద్: చారిత్రక కట్టడాల పరిరక్షణ బాధ్యతల నుంచి హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ను తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో రానున్న నెల రోజుల్లో ఎలాంటి చారిత్రక కట్టడాలను కూల్చబోమని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి సోమవారం హైకోర్టుకు హామీ ఇచ్చారు. హామీని రికార్డ్ చేసుకున్న హైకోర్టు, తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. చారిత్రక కట్టడాల పరిరక్షణ బాధ్యతల నుంచి హెచ్‌ఎండీఏను తొలగిస్తూ ప్రభుత్వం జీవో 183ను జారీ చేసింది.
దీన్ని సవాలు చేస్తూ న్యాయవాది టి.బుచ్చారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ సమయంలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి జోక్యం చేసుకుంటూ, అంత సమయం కౌంటర్‌కు అవకాశం ఇస్తే, ప్రభుత్వం ఈ లోపు కూల్చివేతలు చేపట్టే ప్రమాదం ఉందన్నారు. దీనికి ఏజీ స్పందిస్తూ, ఈ నెల రోజుల్లో తాము ఈ జీవోకు అనుగుణంగా ఎలాంటి చారిత్రక కట్టడాలను కూల్చివేయబోమని హామీ ఇచ్చారు.
చారిత్రక కట్టడాలను కూల్చబోం
Published Tue, Dec 22 2015 1:14 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement