తెలంగాణలోని రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద గేట్లు ఏర్పాటుచేసి రక్షణ చర్యలు చేపడతామని, ఇందుకోసం కేంద్రానికి సహకరిస్తామని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు చెప్పారు.
క్రాసింగ్‌ల వద్ద గేట్ల ఏర్పాటుకు చర్యలు: హరీశ్‌రావు
నర్సాపూర్: తెలంగాణలోని రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద గేట్లు ఏర్పాటుచేసి రక్షణ చర్యలు చేపడతామని, ఇందుకోసం కేంద్రానికి సహకరిస్తామని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు చెప్పారు. గురువారం రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
బస్సులను పరిశీలించాలి: మహేందర్‌రెడ్డి
రవాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభం కాకముందే వారి బస్సులను పరిశీలించాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రమాదంపై విచారణ జరిపిస్తామన్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది: నాయిని
రైలు ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల చికిత్స కోసం ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు.
హైలెవల్ కమిటీతో విచారణ జరపాలి: కిషన్‌రెడ్డి
హైలెవల్ కమిటీతో విచారణ జరిపించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ట్రాక్టర్ డ్రైవర్‌తో బస్సు నడిపించిన వారిపైచర్యలు తీసుకోవాలన్నారు.
ఇది రైల్వేశాఖ చేసిన హత్యే: చాడ వెంకట్‌రెడ్డి
రైలు స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థులను బలితీసుకోవడం రైల్వేశాఖ చేసిన హత్యేనని సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడవెంకట్‌రెడ్డి ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు.
రైల్వే తప్పిదంతోనే..: మాజీ మంత్రి గీతారెడ్డి
రైల్వే తప్పిదమని రాష్ట్ర మాజీమంత్రి గీతారెడ్డి ఆరోపించారు. ఇది దురదృష్టకర సంఘటనని మాజీ మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు.
రెండు రోజుల్లో తాత్కాలిక గేటు ఏర్పాటు: కలెక్టర్
మాసాయిపేట వద్ద రెండు రోజుల్లో తాత్కాలిక గేటు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మెదక్‌జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ చెప్పారు.
డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి దిగ్భ్రాంతి
మెదక్ జిల్లా మాసాయిపేట ఘటనపై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
హృదయవిదారకం: మండలి చైర్మన్ స్వామిగౌడ్
విద్యార్థుల మృతి హృదయ విదారకమని, మనసును కలచి వేస్తున్నదని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రగాఢ సంతాపం: కోదండరాం
విద్యార్థులు మృతి చెందడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు.
రైల్వేగేట్లు ఏర్పాటుచేయాలి: పవన్‌కల్యాణ్,జనసేన అధ్యక్షుడు
రైల్వే క్రాసింగ్‌ల వద్ద రైల్వేగేట్లు ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని పెంచాలి.
కేంద్రం రూ.10 లక్షలివ్వాలి: మంత్రి ఈటెల రాజేందర్
రైల్వే శాఖ ప్రకటించిన రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చాలా తక్కువ. దీన్ని రూ.పది లక్షలకు పెంచాలి. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో వైద్య సేవలందిస్తున్నాం.
ఎక్స్‌గ్రేషియా పెంచాలి: టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా చాలా తక్కువగా ఉంది. దీన్ని పెంచాలి. మానవతా ధృక్పథంతో కడుపుకోత తీర్చే విధంగా సహాయ చర్యలు ఉండాలి.
దుర్ఘటన కలచివేసింది: జానా
నల్లగొండ: మెదక్ జిల్లా మాసాయిపేట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సీఎల్పీ నేత కె.జానారెడ్డి అన్నారు. నల్లగొండలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకోవాలని సూచించారు.
సర్కారీ బడుల వైఫల్యానికి మూల్యం: బండారు
సర్కారీ బడుల వైఫల్యానికి చిన్నారుల ప్రాణాలను మూల్యంగా చెల్లించాల్సి వచ్చిందని లోక్‌సత్తా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండారు రామ్మోహన్‌రావు పేర్కొన్నారు. మూసాయిపేటలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికి తగ్గిపోతుంటే, సమీపంలోని ప్రైవేటు పాఠశాలలకు మాత్రం 7 వేల మంది వెళ్తున్నారన్నారు.
ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి: ఎంపీ పొంగులేటి
సాక్షి, న్యూఢిల్లీ: కాపాలా లేని రైల్వే క్రాసింగ్‌ల కారణంగా ఏటా దేశవ్యాప్తంగా వేలాదిమంది అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని, వీటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మాసాయిపేట దుర్ఘటన అంశాన్ని ఆయన లోక్‌సభ జీరో అవర్‌లో లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బస్సు ప్రమాదంలో విద్యార్థులు దుర్మరణం పాలవడంపై విచారం వ్యక్తం చేశారు.