నేడు ‘పుర’ బాధ్యతలు స్వీకరించనున్న కేటీఆర్
ఆ వెంటనే పురపాలక శాఖ విభాగాలపై సుదీర్ఘ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలను స్వీకరించనున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన రాష్ట్ర పురపాలక శాఖ పరిధిలోని అన్ని విభాగాల పనితీరుపై సమీక్ష జరపనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బుద్ధభవన్‌లో ఈ సమీక్ష జరగనుంది. రాష్ట్ర పురపాలక శాఖ డెరైక్టర్ (సీడీఎంఏ), జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, హైదరాబాద్ మెట్రో రైలు, డీటీసీపీ, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగాల పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు.
కేటీఆర్‌కు అదనపు భద్రత..!
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కె.తారక రామారావుకు భద్రతను మరింత పెంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడిగా, పలు కీలకశాఖల బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఉన్న భద్రతలో భాగంగా కల్పిస్తున్న వాహనశ్రేణిలో అదనంగా ఒక వాహనాన్ని, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని పెంచారు.