పాతబస్తీలో పాగానే లక్ష్యం
⇒ రెండు దశాబ్దాలుగా ఎంబీటీ యత్నం
⇒ 17 డివిజన్లలో ఈసారి పోటీ
⇒ అక్షరాస్యత, అభివృద్ధే ప్రచారాస్త్రాలు
సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రస్తుతం ఒకే ఒక కార్పొరేటర్ స్థానానికి పరిమితమైన మజ్లిస్-బచావో-తహరిక్ (ఎంబీటీ) పార్టీ ఈసారి ఎన్నికల్లో 17 డివిజన్లలో పోటీ పడుతోంది. ప్రధాన రాజకీయ శత్రుపక్షమైన ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తేహదుల్-ముస్లిమీన్ (ఎఐఎంఐఎం)ను మట్టికరిపించేందుకు రెండు దశాబ్దాలుగా ఎంబీటీ ప్రయత్నిస్తూనే ఉంది. 2002లో జరిగిన ఎన్నికల్లో రెండు డివిజన్లను దక్కించుకున్న ఎంబీటీ గత ఎన్నికల్లో మాత్రం ఒకే ఒక డివిజన్‌కు పరిమతమైంది. ఈసారి పాతబస్తీతో పాటు కొత్త నగరంలోనూ అభ్యర్థులను రంగంలో దింపింది. మజ్లిస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పాతబస్తీలో అక్షరాస్యత, అభివృద్ధి నినాదంతో ముమ్మర ప్రచారం సాగిస్తోంది.
పట్టువదులకుండా...
పాతబస్తీలో మజ్లిస్ పార్టీని దెబ్బతీసేందుకు ఎంబీటీ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తోంది. రెండు దశాబ్దాల క్రితం అప్పటి మజ్లిస్ అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీతో ఏర్పడ్డ విభేదాలతో అమానుల్లా ఖాన్ నాయకత్వంలో 1993లో మజ్లిస్- బచావ్ తహరీక్ (ఎంబీటీ) పురుడుపోసుకుంది 1994లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలి విజయం సాధించింది. మజ్లిస్ కంచుకోట చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా అసెంబ్లీ స్థానాల్లో ఎంబీటీ విజయ కేతనం ఎగురవేయగా, మజ్లిస్ కేవలం ఒకే చార్మినార్ నియోజకవర్గానికి పరిమితమైంది. అది కూడా సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ పెద్ద కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ అరంగ్రేటంతో చార్మినార్ దక్కినట్లయింది. అయితే 1999 ఎన్నికల్లో ఎంబీటీ తన బలాన్ని నిలుపు కోలేకపోయింది. రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి
జీహెచ్‌ఎంసీలో...
జీహెచ్‌ఎంసీలో మొట్ట మొదటిసారిగా ఎంబీటీ పక్షాన ఇద్దరు కార్పొరేటర్లు అడుగుపెట్టారు. 2002లో జరిగిన ఎన్నికల్లో చంచల్‌గూడ డివిజన్ నుంచి అమానుల్లా ఖాన్ కుమారుడు అమ్జదుల్లా ఖాన్, బార్కాస్ నుంచి ఆయన సతీమణి సాలేహ బా హమీద్ గెలుపొందారు. ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో అజాంపుర డివిజన్ నుంచి అమ్జదుల్లాఖాన్ ఒక్కరే కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఈసారి మాత్రం 17 డివిజన్లలో ఎంబీటీ తలపడుతూ ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం సాగిస్తోంది.